చేతబడి చేస్తున్నారని.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురి హత్య.. ఊరికి దూరంగా మృతదేహాల దహనం

చేతబడి చేస్తున్నారని.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురి హత్య.. ఊరికి దూరంగా మృతదేహాల దహనం
  • ఊరికి దూరంగా మృతదేహాల దహనం 
  • బిహార్‌‌లోని పూర్నియా జిల్లాలో దారుణం

పాట్నా: బిహార్‌‌లో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. పూర్నియా జిల్లా టెట్మా గ్రామంలో చేతబడులు చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు. అనంతరం వారి మృతదేహాలను దహనం చేశారు. హత్యకు గురైనవారిలో ముగ్గురు మహిళలున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

మృతులను సీతాదేవి, కాళి, రాణిదేవి, బాబు లాల్, మంజీత్ రామ్ గా గుర్తించిన పోలీసులు.. మొత్తం 30 నుంచి 40 మంది గ్రామస్తులు హత్య సమయంలో  అక్కడే ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. సోను కుమార్(16) అనే బాలుడు తప్పించుకుని తమకు సోమవారం ఉదయం సమాచారం అందించాడని చెప్పారు. గ్రామంలో ఇటీవల ఓ చిన్నారి, రామ్‌‌దేవ్ ఒరాన్ అనే వ్యక్తి కొడుకు చనిపోయారని.. వారి మృతికి చేతబడే కారణమని భావించిన పలువురు బాధిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారని వివరించారు.

ఫ్యామిలీ మెంబర్స్ ను ఇష్టమొచ్చినట్లుగా కొట్టి చంపారని తెలిపారు. అనంతరం వారి మృతదేహాలను ట్రాక్టర్‌‌లో ఊరికి దూరంగా తీసుకెళ్లి పొదలో వేసి కాల్చివేశారని వెల్లడించారు. మృతులందరూ ఒక ప్రత్యేక తెగకు చెందినవారన్నారు.  ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని..మరికొంతమందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్‌‌తో పాటు సీనియర్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారని పేర్కొన్నారు.  ఘటనను ప్రతిపక్ష నేత, ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ ఖండించారు.

డీకే టాక్స్ కారణంగా బీహార్‌‌లో నేరాలు తారస్థాయికి చేరుకున్నాయని..రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని ఆరోపించారు. నేరస్తులు జాగ్రత్తగా పనులు చేసుకుపోతుంటే..సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యాంగా ఉందని ఫైర్ అయ్యారు. నిందితులను త్వరగా పట్టుకుని శిక్షపడేలా చేయాలని కోరారు.