IPL auction 2024:10 కోట్ల జాక్ పాట్ వీరులు ఎవరు..? 11 మంది క్రికెటర్లపై ఫ్రాంచైజీల కన్ను

IPL auction 2024:10 కోట్ల జాక్ పాట్ వీరులు ఎవరు..? 11 మంది క్రికెటర్లపై ఫ్రాంచైజీల కన్ను

IPL 2024 వేలానికి ఒక్కరోజు మాత్రమే ఉండడంతో క్రికెట్ లవర్స్ ఈ మెగా ఆక్షన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు (డిసెంబర్ 19) దుబాయ్ వేదికగా వేలంనిర్వహించనున్నారు. తమ ఫేవరేట్ జట్టుకు ఏ ప్లేయర్ వెళ్తాడో.. ఏ ప్లేయర్ ను ఎక్కువ డబ్బు  పెట్టి కొంటారో అని క్రికెట్ ఎక్స్ పర్ట్స్, ఫ్యాన్స్ డిస్కషన్ మొదలు పెట్టేశారు. 

నవంబర్ 26 న ఆయా ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల రిటైన్, రిలీజ్ జాబితాను తెలియజేసింది.మొత్తం 1166 మంది ఆటగాళ్లు వేలం కోసం తమ నమోదు చేసుకోగా.. వీరిలో 333 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ చేయబడ్డారు. 214 మంది భారత క్రికెటర్లతో పాటు.. 119 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. వీరిలో 10 కోట్లకు పైగా డబ్బు పెట్టి ఎవరిని కొంటారో ఇప్పుడు చూద్దాం. 

1) మిచెల్ స్టార్క్ 

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పై ఈ ఐపీఎల్ లో భారీ అంచనాలే ఉన్నాయి. పదునైన పేస్ తో యార్కర్లు వేసే ఈ లెఫ్ట్ హ్యాండర్.. వేలంలో 10 కోట్లకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. 2015లో చివరిసారి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన స్టార్క్.. రీ ఎంట్రీ ఇవ్వడంతో అందరి కన్ను ఈ స్టార్ బౌలర్ పైనే ఉంది. 

2) రచీన్ రవీంద్ర: 

న్యూజీలాండ్ కు చెందిన ఈ ఆల్ రౌండర్ బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ వేయగలడు. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో 500 కు పైగా పరుగులు చేసి ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. రవీంద్రకు భారీ మొత్తం దక్కడం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి. 

3) ప్యాట్ కమిన్స్:

ప్రస్తుత ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ ఈ సారి వేలంలో హాట్ ఫేవరేట్ గా మారాడు. పేస్ బౌలింగ్ తో లోయర్ ఆర్డర్ లో మెరుపులు మెరిపించగలడు. తన కెప్టెన్సీ కూడా జట్టుకు ఉపయోగ పడనుంది. గతేడాది ఐపీఎల్ ఆడని కమిన్స్ 2024 ఐపీఎల్ వేలానికి  అందుబాటులోకి వచ్చాడు. 

4) హసరంగా:

భారత్ లాంటి పిచ్ లపై హసరంగా ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాయం కారణంగా గత కొన్ని నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉంటున్నా.. అంతకు ముందు మెరుగైన ప్రదర్శన చేసాడు. కఠినమైన స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటర్ గాను రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ లంక ఆల్ రౌండర్ కు కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. 

5)ట్రావిస్ హెడ్: 

భారత్ పై వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతంగా ఆడి ఆసీస్ కు వరల్డ్ కప్ అందించిన హెడ్.. టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఓపెనర్ గా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే ఈ లెఫ్ట్ హ్యాండర్ భారీగానే అమ్ముడుపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

వీరితో పాటు దక్షిణాఫ్రికా  నుంచి ఫాస్ట్ బౌలర్ కొయెట్జ్, స్పిన్నర్ మహరాజ్, బ్యాటర్ రిలీ రూసో ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ నుంచి హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లిస్, హేజెల్ వుడ్ పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నారు. భారత్ నుంచి శార్దూలు ఠాకూర్ ఈ ఆక్షన్ లో బిగ్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది.