
- అన్ని కేటగిరిల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్
- స్థానిక సంస్థల్లో పెరుగనున్న ప్రాతినిధ్యం
- రిజర్వేషన్ల ఖరారుతో నేతల ఆశలు గల్లంతు
- మాజీ జడ్పీ చైర్మన్లకు షాక్
- గత ఎన్నికల్లో పోటీ చేసిన జడ్పీటీసీ స్థానాల్లో మార్పు
ఆదిలాబాద్, వెలుగు: స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యారు. ఈసారి మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని కేటగిరిల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. అత్యంత ప్రాధాన్య జడ్పీ పీఠం ఈసారి రెండు జిల్లాల్లో మహిళలకే దక్కింది. ఆదిలాబాద్ జిల్లా జనరల్ మహిళ, మంచిర్యాల బీసీ మహిళకు కేటాయించారు. ఇక నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు బీసీ జనరల్ కేటాయించారు.
ఆదిలాబాద్ మినహా మూడు జిల్లాలు బీసీలకే దక్కాయి. జడ్పీ స్థానాల రిజర్వేషన్లను రొటేషన్ విధానంలో మారుస్తామని ప్రభుత్వం ముందే చెప్పింది. అందుకు తగినట్లుగానే గతంలో కేటాయించిన వర్గానికి కాకుండా వేరే సామాజిక వర్గాలకు కేటాయించారు.
నేతల ఆశలు గల్లంతు
రిజర్వేషన్ల కేటాయింపుతో చాలా మంది ఆశలు గల్లంతయ్యాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఇలా అన్ని కేటగిరీల్లో ఈ సారి రిజర్వేషన్లు మారిపోవడంతో ఎన్నో రోజులుగా ఆశతో ఉన్న నేతలకు షాక్ తగిలింది. ముఖ్యంగా మాజీ జడ్పీ చైర్మన్, చైర్పర్సన్ల ఆశలు ఆవిరయ్యాయి. ఇదివరకు వారు చేసిన స్థానాలు వేరే సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో వారు పోటీ చేసే అవకాశం లేకుండాపోయింది.
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ గత ఎన్నికల్లో నార్నూర్ ఎస్టీ స్థానం నుంచి గెలుపొందగా ఈ సారి ఆ స్థానం ఎస్సీలకు వెళ్లింది. నిర్మల్ జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి గతంలో జనరల్స్థానం నుంచి పోటీ చేయగా ఇప్పుడు ఆ సీటును బీసీ జనరల్ కు కేటాయించారు.
మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ గతంలో చెన్నూర్ ఎస్సీ జడ్పీటీసీగా గెలిచారు. ఇప్పుడు బీసీ జనరల్ కు వెళ్లింది. కుమ్రం భీం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వ్ స్థానం నుంచి గెలిచారు. అయితే ఆమె ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. జడ్పీ చైర్మన్లతో పాటు చాలా మందికి వారు ఆశించిన స్థానాల్లో రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో నిరాశకు గురయ్యారు.
ఎన్నికపై పార్టీల ఫోకస్
స్థానిక సంస్థల ఎన్నికలు ఖరారు కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఎలక్షన్‌పై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ఆయా పార్టీల్లో చేరికల జోరు కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్నికల్లో పోటీపై అభ్యర్థుల ఎంపిక విషయంలో బలాబలాలపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా జడ్పీ పీఠం దక్కించుకునేందుకు బలమైన జడ్పీటీసీ అభ్యర్థులకే టికెట్ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకపోయినప్పటికీ రిజర్వేషన్ల ఖరారుతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ సందడి నెలకొంది. ప్రస్తుతం బతుకమ్మ, దసరా వేడుకలకు మహిళా ఓటర్లు, యువతను ఆకట్టుకునేందుకు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల వివరాలు
జిల్లా జీపీ జడ్పీటీసీ ఎంపీటీసీ
ఆదిలాబాద్ 473 20 166
మంచిర్యాల 305 16 129
నిర్మల్ 400 18 157
ఆసిఫాబాద్ 335 15 127