జైళ్లలో మగ్గుతున్న మహిళా ఖైదీలకు శుభవార్త

జైళ్లలో మగ్గుతున్న మహిళా ఖైదీలకు శుభవార్త

న్యూఢిల్లీ :  ఏండ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న మహిళా ఖైదీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. 75 ఏండ్ల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా యాభై ఏండ్లు పైబడిన మహిళా ఖైదీలు, ట్రాన్స్​జెండర్లను విడుదల చేయాలని భావిస్తోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్​ సందర్భంగా ఈ విషయాన్ని కేంద్రహోం శాఖ మంగళవారం ప్రకటించింది. దీంతోపాటు తమ శిక్షాకాలంలో సగానికి పైగా పూర్తిచేసుకున్న 60ఏళ్లు దాటిన పురుషులు, దివ్యాంగ ఖైదీలకూ స్వేచ్ఛ కల్పించనున్నట్లు సమాచారం. శిక్ష పూర్తిగా అనుభవించినా జరిమానాలు చెల్లించక ఇప్పటికీ జైళ్లలోనే మగ్గుతున్న పేద ఖైదీలకూ మేలు జరగనుంది. వాళ్లు చెల్లించాల్సిన ఫైన్​ మొత్తాన్ని మాఫీ చేసి, వారిని రిలీజ్​ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, మరణశిక్ష, జీవిత ఖైదు పడిన వారికి, అత్యాచారం, టెర్రరిజం ఆరోపణలు, వరకట్న హత్యలు, మనీలాండరింగ్ కేసుల్లో దోషులుగా తేలిన ఖైదీలకు ఈ స్కీం వర్తించదని హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అర్హతలున్న ఖైదీలను 3 విడతల్లో..

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్దేశించిన అర్హతలు ఉన్న ఖైదీలను 3 విడతల్లో.. అంటే  వచ్చే ఆగస్టు 15 న కొందరిని, 2023 జనవరి 26న ఇంకొందరిని, 2023 ఆగస్టు 15 న మిగతా వారిని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. కాగా, 2020 అధికారిక అంచనాల ప్రకారం.. మన దేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంఖ్య 4.78 లక్షలు అని రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లు అన్నింటి కెపాసిటీ మాత్రం 4.03 లక్షలు మాత్రమే.. ఈ లెక్కన దాదాపు ప్రతీ జైలు కూడా ఖైదీలతో కిక్కిరిసినయి. ఈ 4.78 లక్షల మంది ఖైదీలలో దాదాపు లక్ష పైచిలుకు మహిళా ఖైదీలు ఉన్నారని అధికారవర్గాల సమాచారం.