సిటీలో అభివృద్ధి పనులకు కేంద్రానివే నిధులు : బండి సంజయ్

సిటీలో అభివృద్ధి పనులకు కేంద్రానివే నిధులు : బండి సంజయ్

కరీంనగర్, వెలుగు : ఎంపీగా గెలిపిస్తే బండి సంజయ్ కరీంనగర్‌‌‌‌కు చేసిందేమీ లేదంటూ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేస్తున్న దుష్ర్పచారాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. సిటీలోని 35వ డివిజన్ లో గాజా రమేశ్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది కార్యకర్తలు, నాయకులు బండి సమక్షంలో బీజేపీలో చేరారు.

వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ  'స్మార్ట్ సిటీకి నిధులు తెచ్చిన.. తీగలగుట్టలపల్లి ఆర్వోబీ నిధులు తెచ్చిన.. రోడ్లకు నిధులు తెచ్చిన.. అంతెందుకు డ్రైనేజీ, టాయిలెట్లు సహా కరీంనగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోంది'అని వివరించారు. 'కమలాకర్... డేట్, టైం ఫిక్స్ చేయ్. అకౌంట్స్ తీసుకుని రా.. నేను ఎంపీగా గెలిచాక కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చానో లెక్కలతో సహా వస్తా.. చర్చిద్దాం' అంటూ గంగులకు  సవాల్ విసిరారు.

తాను ఎంపీగా ఎన్నికయ్యాక రూ.8 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చానని తెలిపారు. నిధులు తాను తీసుకొస్తే కొబ్బరికాయ మాత్రం బీఆర్ఎస్ నేతలు కొట్టి తామే నిధులు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు.