దళిత బంధుకు 500 కోట్లు విడుదల

దళిత బంధుకు 500 కోట్లు విడుదల
  • దళిత బంధుకు 500 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్​
  • హుజూరాబాద్​కే రూ.2 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా
  • అందులో పావువంతే రిలీజ్ చేసిన ప్రభుత్వం
  • ఒక్కో ఫ్యామిలీకి రూ.10 లక్షలు ఇస్తే.. 5 వేల కుటుంబాలకే లబ్ధి
  • మిగతా వాళ్లకు ఎప్పుడు ఇస్తారనే చర్చ

హైదరాబాద్, వెలుగు: దళిత బంధు పథకానికి రాష్ట్ర సర్కార్ బుధవారం నిధులు విడుదల చేసింది. రూ.500 కోట్లకు ఫైనాన్స్​ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) ఇచ్చారు. దళిత బంధు పథకం కింద అర్హులైన దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు ఈ స్కీం వర్తింపజేస్తమని సీఎం కేసీఆర్ తెలిపారు. అట్ల అమలు చేస్తే రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. అయితే ఇప్పుడు అందులో కేవలం పావువంతు నిధులే రిలీజ్ చేశారు. దీంతో దళితబంధు స్కీం కింద ఎన్ని కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున అందిస్తరనే దానిపై చర్చ నడుస్తోంది. అయితే దళిత బంధుపై అఖిల పక్ష మీటింగ్​పెట్టుకున్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రూ.1200 కోట్లు ఖర్చు చేస్తామని సీఎం అన్నారు. 


సాయం కొందరికేనా?
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా దళిత బంధు అమలు చేస్తామని సర్కార్​ తెలిపింది. అయితే ప్రభుత్వం రిలీజ్ చేసిన రూ.500 కోట్లతో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తే 5 వేల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. దీంతో కేవలం ఐదు వేల కుటుంబాలకే పైసలు అందుతాయా ? మిగతా వారికి ఎప్పుడిస్తరు మరి అనే చర్చ జరుగుతోంది. సీఎంవో ఇచ్చిన లెక్కల ప్రకారం హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్ మండలంలో 4,346,  వీణవంకలో 3,678 , జమ్మికుంటలో 4,996 , ఇల్లందకుంట మండలంలో 2,586 కుటుంబాల చొప్పున మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అనర్హులను తీసేసి మిగిలిన వారికి దళిత బంధు అమలు చేస్తమని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న హుజూరాబాద్​లో ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయనే దానిపై అధికారుల్లో తర్జనభర్జన జరుగుతోంది. ముందు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 20,929 కుటుంబాలు అని చెప్పారు. ఈ నెల 26న హుజూరాబాద్ దళిత ప్రతినిధులో సీఎం జరిపిన అవగాహన సదస్సులో లెక్కలపై గందరగోళం వచ్చినట్లు తెలిసింది. నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్లు మొత్తం 25 వేల కుటుంబాలు ఉంటాయని సీఎంతో చెప్పినట్లు సమాచారం. సమగ్ర కుటుంబ సర్వే జరిగి ఏడేళ్లు కావొస్తున్నందున చాలా మార్పులు జరిగినట్లు చెప్పారు. దీంతో దళిత కుటుంబాల లెక్కలు మరోసారి తీయాలని కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు మిషన్ భగీరథలో తీసుకున్న వివరాల ఆధారంగా దళిత కుటుంబాలను లెక్కలోకి తీసుకునే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. అయితే అందులోనూ పూర్తి వివరాలు లేకపోవడంతోనే హుజూరాబాద్​లో సర్వే ఆధారంగా కుటుంబాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నరు.