ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 52 మంది మృతి

ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 52 మంది మృతి

రూప్‌గంజ్: బంగ్లాదేశ్‌లోని ఓ ఫుడ్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో 52 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు బంగ్లా పోలీసులు తెలిపారు. దాదాపు 24 గంటలుగా ఫ్యాక్టరీలో మంటలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రూప్‌గంజ్‌లో ఉన్న ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఆరు అంతస్తుల హషెమ్‌ ఫుడ్ అండ్ బేవరేజ్ ఫ్యాక్టరీలో గురువారం మధ్యాహ్నం ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఫైరింజన్లు అక్కడి చేరుకుని మంటలు ఆర్పుతున్నా.. 24 గంటలు గడుస్తున్నా శుక్రవారం మధ్యాహ్నానికి కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని అధికారులు చెబుతున్నారు. మొదట పోలీసులు ముగ్గురు మరణించారని ప్రకటించినప్పటికీ భారీ సంఖ్యలో కార్మికులు మంటల్లో చిక్కుకుని ఉండడంతో డెత్స్ భారీగా పెరుగుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతూ పై అంతస్తుల్లోకి వెళ్లగా అక్కడ పదుల సంఖ్యలో కార్మికుల డెడ్‌ బాడీలను గుర్తించారు. మంటల్లో సజీవ దహనమైపోయి.. పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీ ఎదుట వందల సంఖ్యలో బాధితుల కుటుంబ సభ్యులు వచ్చి ఆర్తనాదాలు చేస్తున్నారు. 
ఐదు, ఆరు ఫ్లోరుల్లో ఇంకా మంటలు
మంటల నుంచి తప్పించుకునేందుకు 30 మందికి పైగా కార్మికులు బిల్డింగ్ పైనుంచి దూకారు. వారిలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీస్ ఇన్‌స్పెక్టర్ షేక్ కబీరుల్ ఇస్లామ్ చెప్పారు. ఇంకా ఐదు, ఆరు అంతస్తుల్లో మంటలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు 25 మంది కార్మికులను అగ్నిమాపక సిబ్బంది సేఫ్‌గా కాపాడారని తెలిపారు. మంటలు పూర్తిగా కంట్రోల్‌ లోకి వచ్చాక బిల్డింగ్ మొత్తం సెర్చ్ చేస్తామని, మృతుల సంఖ్యను అప్పుడే కన్ఫామ్ చేయగలమని ఫైర్ సర్వీస్ ఆఫీసర్ దెబాశిష్ బర్ధాన్ తెలిపారు. ఫ్యాక్టరీలో భారీగా ఉన్న కెమికల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ కారణంగా మంటలు కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారిందని ఢాకా ఫైర్ డిపార్ట్‌మెంట్ హెడ్ దినూ మోనీ శర్మ చెప్పారు.