బీసీ జనగణమన చేపట్టాలే : వక్తలు డిమాండ్

బీసీ జనగణమన చేపట్టాలే : వక్తలు డిమాండ్
  • బీఎస్పీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ భేటీలో వక్తలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీసీ జనాభాకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలని, బీసీ జనగణన చేపట్టాలని వక్తలు డిమాండ్ చేశారు. బీసీల జనాభా 50 శాతంపైగా ఉన్నా న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి’ అనే అంశంపై సోమవారం బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నేతలు, విద్యావేత్తలు హాజరయ్యారు. 

టీజేఎస్ నేత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వెలమ కమ్యూనిటీ 0.4 శాతం మాత్రమే ఉందని, వారే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు, వెలమలు, కమ్మలు మాత్రమే రాజ్యమేలుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకుల పార్టీలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తూ తీర్పులు ఇస్తున్న సందర్భాలు చూస్తున్నామని బహుజన ఉద్యమ నేత నారగోని అన్నారు. రిజర్వేషన్ల శాతం 50 దాటొద్దని ఎక్కడా లేదని, తమిళనాడులో 60 శాతంపైగా రిజర్వేషన్లు ఇస్తున్నారని ఆయన చెప్పారు.