బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 6 శాతం వాటా అమ్మకం..

బ్యాంక్ ఆఫ్  మహారాష్ట్రలో 6 శాతం వాటా అమ్మకం..

 OFS కు ఫుల్‌ డిమాండ్ రావడంతో అదనంగా షేర్లు అమ్మనున్న కేంద్రం

న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో  (బీఓఎం)లో 6శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌ఎస్‌‌)  ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్ బాగుండడంతో  గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా ముందు అనుకున్న దాని కంటే ఎక్కువ షేర్లను అమ్మనుంది.  నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మంగళవారం ఓఎఫ్‌‌ఎస్  ప్రారంభమైంది. 

ఫ్లోర్ ప్రైస్ రూ.54గా నిర్ణయించారు.  ఇది గత రోజు ముగింపు ధర రూ.57.66తో పోలిస్తే 6.34శాతం తక్కువ. ఈ ఇష్యూలో 38.45 కోట్ల షేర్లను అమ్మాలని ప్రభుత్వం ప్లాన్ చేయగా, ఓఎఫ్‌‌ఎస్ మొదటిరోజే  400శాతం సబ్‌‌స్క్రయిబ్ అయ్యింది. దీంతో  అదనంగా 7.69 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టారు. మొత్తం 46.14 కోట్ల షేర్లు, అంటే 6శాతం వాటాను  విక్రయించనున్నారు. 

ఈ విక్రయం ద్వారా ప్రభుత్వం సుమారు రూ.2,492 కోట్లు సమీకరించనుంది. ప్రస్తుతం బీఓఎంలో ప్రభుత్వ వాటా 79.6శాతం ఉండగా, ఇష్యూ తర్వాత ఇది 75శాతం కంటే తక్కువకు తగ్గుతుంది. దీంతో  సెబీ నిర్దేశించిన కనీస పబ్లిక్ షేర్‌‌హోల్డింగ్ 25శాతం నిబంధనను బ్యాంక్ పాటించగలుగుతుంది.  ఐఓబీ(94.6శాతం), పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌‌ (93.9శాతం), యూకో బ్యాంక్ (91శాతం), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (89.3శాతం)లో కూడా ప్రభుత్వం వాటా ఎక్కువగా ఉంది.