బిహార్లో ఏకంగా బ్రిడ్జినే దొంగిలించిన్రు

బిహార్లో ఏకంగా బ్రిడ్జినే దొంగిలించిన్రు

రోహతాస్/బిహార్: పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ ఇనుప బ్రిడ్జిని దొంగలెత్తుకెళ్లారు. చెప్పుకోవడానికి వింతగా ఉన్నా ఈ సంఘటన నిజంగానే జరిగింది.  బిహార్ రాష్ట్రం రోహతాస్ జిల్లాలోని అమియావార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వారం కిందట కొంత మంది వ్యక్తులు తాము ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులమంటూ అమియావార్ గ్రామానికి వచ్చారు. అలాగే కొంతమంది వర్కర్స్ తో పాటు  జేసీబీ, గ్యాస్ కట్టర్స్, లారీలను కూడా తీసుకొచ్చారు. గ్రామంలోని ఇనుప బ్రిడ్జిని తొలగించేందుకు పనులు షురూ చేశారు. గమనించిన గ్రామస్థులు వారిని నిలదీశారు. లోకల్ అధికారులకు కూడా సమాచారం అందించారు.

అయితే.. ఆ వ్యక్తులు తాము ప్రభుత్వ అధికారులమని, ఇక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందుకే తాము పాత బ్రిడ్జిని తొలగిస్తున్నామని నమ్మబలికారు. అది నిజమని నమ్మిన స్థానికులు, లోకల్ అధికారులు... వాళ్లకు సంపూర్ణ సహకారం అందించారు. ఇంకేముంది.. 60 ఫీట్ల పొడవు, 12 ఫీట్ల ఎత్తు ఉన్న ఇనుప బ్రిడ్జిని మూడు రోజుల్లో తొలగించి... లారీల్లో వేసుకుని చెక్కేశారు ఆ దొంగలు. చివరికి విషయం తెలుసుకున్న స్థానికులు, అధికారులు ఖంగుతిన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... స్థానికుల నుంచి దొంగల ఆనవాళ్లను గుర్తించే పనిలో పడ్డారు. అలాగే స్క్రాప్ డీలర్ల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నామని నస్రిగంజ్ ఎస్హెచ్వో సుభాష్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత

ఎగ్జామ్​ ఏదైనా... జీఎస్​ కామన్