600 మంది పోలీసులు..400 సీసీ కెమెరాలు..గణపతి నవరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు

 600 మంది పోలీసులు..400 సీసీ కెమెరాలు..గణపతి నవరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు
  • ప్రతి మండపానికి జియో ట్యాగ్: ఎస్పీ

ఆదిలాబాద్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా 600 మంది పోలీసులు, 400 సీసీ కెమెరాలతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం పోలీసు కార్యాలయంలో పోలీస్​ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఉత్సవాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, ప్రజలంతా కలిసిమెలిసి పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణాల్లో క్లస్టర్లు, సెక్టార్లుగా విభజించి బందోబస్తు పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. 

ప్రతి గణపతి మండపాన్ని జియో ట్యాగ్ చేసి పర్యవేక్షించనున్నామని, జిల్లా వ్యాప్తంగా 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటలు నిఘా ఏర్పాటుచేశామన్నారు. మండపాల వద్ద నిర్వాహకులు పోలీసుల సూచనలను పాటించాలన్నారు. గణపతి నిమజ్జనం చేసే చాందా, పెన్ గంగా వద్ద మహిళా సిబ్బందిని కేటాయించి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టే వారిపై, వాట్సాప్ గ్రూపు అడ్మిన్​లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, పట్టణ సీఐలు పాల్గొన్నారు.