బాబోయ్ కుక్కలు .. 5 నెలల్లోనే 601 కుక్క కాటు కేసులు

బాబోయ్ కుక్కలు .. 5 నెలల్లోనే 601 కుక్క కాటు కేసులు

వనపర్తి, వెలుగు:  వనపర్తిలోని 11వ వార్డులో ఓ చిన్నారిపై ఇటీవల కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. వెంట ఉన్న చిన్నారి తల్లి అదిలించబోగా, ఆమెపైకి ఎగబాకే ప్రయత్నం చేసింది.కొత్తకోట పట్టణంలోనూ ఈ నెల మొదటి వారంలో ఒక చిన్నారి ఇంటి పక్కన ఆడుకుంటుండగా, కుక్క దాడి చేసి గాయపరించింది. పక్కనే ఉన్న పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు కుక్కను అదిలించి కాపాడారు. వనపర్తి  జిల్లా వ్యాప్తంగా ఇలా పల్లె పట్టణాల్లో కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. పగలు, రాత్రి అన్న  తేడా లేకుండా దాడులు చేస్తుండడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

చిన్నారులపైనే కాకుండా పెద్దవారిపై సైతం దాడికి తెగబడుతున్నాయి. గత అయిదు నెలల్లో జిల్లాలో 601 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదు కాకుండా ప్రైవేటులో చూపించుకుని చికిత్స చేయించుకున్న వారూ ఉన్నారు. కుక్కల్లో సంతాన ఉత్పత్తిని తగ్గించేందుకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నియంత్రణ కేంద్రం నిరుపయోగంగా మారింది. కేంద్రం ప్రారంభం కాకపోవడంతో నిర్వహణ పూర్తిగా నీరుగారి పోయింది. ఇప్పటికైనా అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.