- తొలిసారి ఆతిథ్యమిస్తున్న భారత్.. వారం రోజుల పాటు పోటీలు
- 24 దేశాల నుంచి 108 మంది రోటరీ గోల్ఫ్ క్రీడాకారుల రాక
- ఈ ఈవెంట్‌తో రాష్ట్ర పర్యాటకానికి ఎంతో మేలన్న మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ మరో అతిపెద్ద టోర్నీకి వేదికైంది. తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక 60వ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్ షిప్‌ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం సిటీలో ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ చాంపియన్ షిప్‌లో 24 దేశాలకు చెందిన 180 మంది రోటరీ గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించే రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ గోల్ఫింగ్ ఫెలోషిప్ ఆఫ్ రోటారియన్స్ (ఐజీఎఫ్ఆర్) సహకారంతో ప్రసూతి, శిశు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో దీనిని నిర్వహిస్తోంది.
హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ & కంట్రీ క్లబ్, వూటీ గోల్ఫ్ కౌంటీలలో ఈ చాంపియన్ షిప్ జరుగుతుంది. ఈ టోర్నీ కేవలం గోల్ఫ్ ప్రమోషన్ కోసమే కాకుండా మన దేశంలోని పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలు, ఆతిథ్యం వంటి వాటిని విదేశీ గోల్ఫర్లకు అందించడమే లక్ష్యంగా ఉండబోతోంది. హైదరాబాద్‌లో అద్భుతమైన ఫలక్‌నామా ప్యాలెస్, గోల్కొండ కోట వంటి టూరిజం ప్రదేశాలనూ ఈ చాంపియన్ షిప్‌లో భాగం చేశారు. టోర్నీలో ఆడుతున్న గోల్ఫర్లకు ఈ ప్రాంతాల ప్రత్యేకతలను వివరిస్తూ సందర్శన ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఈవెంట్ రాష్ట్రానికి గర్వకారణం: మంత్రి జూపల్లి
అంతర్జాతీయ గోల్ఫ్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం రాష్ట్రానికి రావడం గర్వంగా భావిస్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టూరిజం శాఖ మంత్రిగా ఎలాంటి మద్దతు కావాలన్నా అందిస్తామన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్ఫ్ కోర్సులు హైదరాబాద్‌లో ఉండడం, వాటిలోనే ఈ పెద్ద టోర్నీ జరుగుతుండడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. టూరిజం అభివృద్ధి క్రీడలతోనూ ముడిపడి ఉందని, ముఖ్యంగా విదేశీ పర్యాటకలకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడం తమ బాధ్యతగా ఆయన చెప్పుకొచ్చారు.
ఈ చాంపియన్ షిప్‌లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులు హైదరాబాద్ ఆతిథ్యం స్వీకరించడమే కాకుండా ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ప్రత్యేకంగా వీక్షించాలని కోరారు. ప్రపంచ టూరిజంలో హైదరాబాద్‌కు ఈ టోర్నీ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గోల్ఫర్లకు మంత్రి అభినందనలు తెలిపారు.
