పెళ్లికుమార్తెల పేరిట పాక్ నుంచి చైనాకు అమ్మాయిల్ని అమ్ముతున్న చైనా ముఠాను పాక్ పోలీసులు గుట్టురట్టు చేశారు
పాక్ – చైనా దేశాల స్నేహ బంధంవల్ల వ్యభిచారం కూపంలో మగ్గుతున్న బాధితుల్ని రక్షించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈఏడాది సెప్టెంబర్ లో పాకిస్తాన్ ఫైసలాబాద్ లో 31 అమ్మాయిల్ని చైనాకు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్ధికంగా చితికిపోయి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న యువతుల్ని పాక్ – చైనా దళారులు భారీ ఎత్తున డబ్బు ఆశచూపించి చైనా బీజింగ్ కు తరలిస్తున్నారు.
పాక్ నుంచి యువతుల్ని వధువులుగా పరిచయం చేసి వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. దీనిపై పాక్ ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడంతో పైసలాబాద్ కోర్ట్ లో కేసు నమోదైంది. బాధితుల నుంచి వివరాలను సేకరించే ప్రయత్నం చేయగా దళారులు బాధితుల్ని హింసలకు గురిచేయడంతో కేసు నీరు గారింది.
అయితే రాను రాను అమ్మాయిల అక్రమరవాణ తీవ్రతరం కావడంతో పాక్ కు చెందిన సామాజిక కార్యకర్త అక్బర్ సలీం న్యాయపోరాటం చేస్తున్నారు. తాజాగా 629మంది యువతుల్ని బీజీంగ్ దళారులకు అమ్మేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆర్ధికంగా నలిగిపోతున్న కుటుంబాలకు డబ్బు ఆశచూపిస్తున్నారు. చైనాకు చెందిన దళారుల వద్ద ఒక్కో యువతికి 40లక్షల నుంచి 70లక్షలు వసూలు చేస్తున్నారు. కానీ కుటుంబానికి 2లక్షల, 3లక్షలిచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.
పెళ్లి పేరుతో పాక్ నుంచి చైనా బీజీంగ్ కు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. కాదని తిరగబడితే ప్రాణాలు తీస్తున్నారు.
అయితే ఈ వ్యవహారంపై చైనా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. పాక్ – చైనాల మధ్య ఆర్ధిక, వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని ఉద్దేశంతో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. పాక్ సైతం చైనా పై ఆంక్షలు విధించే ప్రయత్నం చేయలేకపోతుంది. దీన్ని ఆసరగా చేసుకొనే దళారులు పేట్రోగిపోతున్నారు.

