సెకండ్‌‌ వేవ్‌‌ ఎఫెక్ట్.. 645 మంది  పిల్లలు అనాథలు

సెకండ్‌‌ వేవ్‌‌ ఎఫెక్ట్.. 645 మంది  పిల్లలు అనాథలు

హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్ వేవ్‌‌లో దేశవ్యాప్తంగా 645 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరిని కోల్పోయి అనాథలయ్యారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌‌లో 158 మంది పిల్లలు అనాథలవగా, ఏపీలో 119 మంది, మన రాష్ట్రంలో 23 మంది పిల్లలు పేరెంట్స్​ను కోల్పోయారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు సమర్పించిన వివరాలను శనివారం కేంద్ర ప్రభుత్వం లోక్‌‌సభలో వెల్లడించింది. ఈ పిల్లలందరికీ పీఎం కేర్స్‌‌ నుంచి రూ. 10 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్టు తెలిపింది. ఈ పది లక్షలను కార్పస్‌‌ ఫండ్‌‌గా జమ చేసి,18 ఏండ్లు వచ్చిన తర్వాత వాళ్లకు ఇవ్వనున్నట్టు పేర్కొంది. అనాథలైన పిల్లలకు విద్య, వైద్యం పూర్తి ఉచితంగా అందజేస్తామని తెలిపింది. కరోనాతో అనాథలైన పిల్లల వివరాలను pmcaresforchildren.in కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని ప్రజలకు సర్కార్ సూచించింది. మన రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్‌‌లో వేల మంది చనిపోయారు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. కానీ, రాష్ట్ర సర్కార్ మాత్రం 23 మంది మాత్రమే అనాథలైనట్టు చెబుతోంది. ఇలా అసలు లెక్కను తక్కువ చేసి చూపించడం వల్ల అనాథలైన పిల్లలు, పీఎం కేర్‌‌‌‌ నిధులకు నోచుకోకుండా పోయే ప్రమాదం ఉంది.