రాష్ట్ర చరిత్రలోనే రికార్డు వర్షపాతం...మేడారం జలదిగ్భంధం...

రాష్ట్ర చరిత్రలోనే  రికార్డు వర్షపాతం...మేడారం జలదిగ్భంధం...

రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది.  అన్ని  జిల్లాలలోని  అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా  ములుగు జిల్లాపై వరుణుడు పగబట్టాడు. తెలంగాణ చరిత్రలోనే అత్యంత రికార్డు వర్షపాతం ములుగు జిల్లాలో నమోదైంది. 24 గంటల్లో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8 మిల్లీ మీటర్లు..అంటే 64 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదవడం గమనార్హం.  లక్ష్మీదేవ్ పేట్ వద్ద 533.5 మిల్లీ మీటర్లు అంటే 53 సెంటీ మీటర్ల  వర్షపాతం రికార్డయింది. గత 24 గంటల్లో ములుగు జిల్లాలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల పైన వర్షం పడింది. 

మునిగిన మేడారం..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లాలో పరిస్థితి దారుణంగా మారింది. ములుగు జిల్లా కేంద్రం వరదలతో అతలాకుతలం అవుతుంది.  గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి సమీపంలో గుండ్ల వాగుపై 163వ జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జికి సమీపంలో రోడ్డు తెగిపోయింది. రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి గుండ్ల వాగు పొంగి ప్రవహిస్తోంది . దీంతో రోడ్డుకు గండి పడి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వరంగల్ వైపుకు వెళ్లే పరిస్థితి లేదు. ఏ క్షణమైనా రోడ్డు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది.  మేడారం నీటమునిగింది. మేడారం పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. మేడారం జాతర ప్రాంగణంలోకి నీరు చేరింది.  దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మేడారం  దగ్గర్లోని పడిగాపురం గ్రామాన్ని జంపన్న వాగు చుట్టుముట్టింది, దీంతో పడిగాపురం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. 

ములుగు జిల్లా మంగపేట మండల వ్యాప్తంగా జులై 27వ తేదీ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు  వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రమణక్కపేట గ్రామంలో పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది. దీంతో వరదలో చిక్కుకున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అటు జీవంతరావు పల్లి, పాలసావు పల్లి గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. నీట మునిగిన ఇళ్లలోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ములుగు మండలం మదనపల్లి చెరువుకట్ట తెగిపోవడంతో చెరువులోని నీరు ఇళ్లల్లోకి చేరుతుంది. వెంకటాపూర్ ప్రాంతంలో శివారులో మారేడు కొండ చెరువుకు నాలుగువైపులా గండ్లు పడడంతో ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.