కన్నవారి ప్రేమ కరువై.. వృద్ధురాలు ఆత్మహత్య

కన్నవారి ప్రేమ కరువై.. వృద్ధురాలు ఆత్మహత్య

కట్టుకున్న భర్త దూరమై, కన్నవారి ప్రేమ కరువై.. మలి దశలో వృద్ధాశ్రమంలో ఉండలేక ఓ  వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది.  హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

మీర్ పేట్ పీఎస్ ఇన్స్ పెక్టర్ వై. యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. భారతి(65) అనే వృద్ధురాలికి ఇద్దరు కూతుళ్లు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఒకరు USA లో, మరొకరు బెంగుళూర్ లో ఉంటున్నారు. భర్త చనిపోయి హైదరాబాద్ లో ఒంటరిగా ఉంటున్న భారతిని ఆమె కూతురు ఎల్బీ నగర్ లోని ఓ ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసింది. ఆ తర్వాత బెంగుళూరు వెళ్లిపోయింది.

కొంతకాలంగా వృద్ధాశ్రమంలోనే ఉంటున్న భారతి.. తన ఆలనా పాలనా చూసేవాళ్ళు లేక, తన కష్ట సుఖాలు చెప్పుకునే వారు లేక మనస్థాపానికి గురైంది.  ఆ బాధ ని భరించలేక నిన్న(ఆదివారం)  ఉదయం 8.30 గంటల సమయంలో పండ్లు కొనడానికని వృద్ధాశ్రమం నుంచి బయటకి వచ్చింది. ఆ తర్వాత తిరిగి ఓల్డేజ్ హోమ్ కి వెళ్లకపోవడంతో ఆశ్రమం నిర్వాహకులు ఆమె కోసం చుట్టూ పక్కల వెతికారు. వృద్ధురాలి ఆచూకీ దొరకకపోవడంతో మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొంతసేపటికి అదే స్టేషన్ కి మీర్ పేట్ లోని లెనిన్ చెరువులో ఓ మహిళ మృతదేహం కన్పించిందని ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ ద్వారా సంఘటనా స్థలికి వెళ్లిన మీర్ పేట్ పోలీసులు ఆధారాలు బట్టి చనిపోయిన మహిళ.. వృద్ధురాలు భారతి నే అని చెప్పారు.

జీవితం చివరి దశలో ఒంటరిగా బతుకలేక, వృద్ధాశ్రమంలో ఉండలేక భారతీ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఇన్స్ పెక్టర్ అన్నారు.