రాష్ట్రంలో రూ.60,799 కోట్లతో రోడ్ల నిర్మాణం : మంత్రి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో రూ.60,799  కోట్లతో రోడ్ల నిర్మాణం : మంత్రి వెంకట్ రెడ్డి
  • 8 లేన్లుగా హైదరాబాద్‌‌- విజయవాడ హైవే: మంత్రి వెంకట్ ​రెడ్డి
  • రూ.11 వేల కోట్లతో గ్రామాల్లో హ్యామ్‌‌‌‌ రోడ్ల నిర్మాణం
  • రూ.36 వేల కోట్లతో ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ చేపడ్తున్నామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రూ.60,799 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మరో రూ.28 వేల కోట్ల విలువైన రోడ్ల పనులు ప్రతిపాదన దశలో ఉన్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

రాష్ట్ర అభివృద్ధి, జీడీపీ పెరుగుదల లక్ష్యంగా, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని రూ.10,400 కోట్లతో ఎనిమిది లేన్ల రోడ్డుగా విస్తరిస్తున్నామని చెప్పారు. ఇందులో ఆరు లేన్లు ప్రధాన రహదారి కాగా, రెండు లేన్లు సర్వీస్ రోడ్లుగా ఉంటాయని తెలిపారు. 

రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌) నిర్మాణాన్ని రూ.36 వేల కోట్లతో చేపడ్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మెజారిటీ జిల్లాలను కలుపుతూ ఈ రోడ్డు నిర్మాణం సాగుతుందని, ఇందుకు అవసరమైన నిధుల్లో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

 ఇక హ్యామ్ ప్రాజెక్టు కింద రూ.11,399 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టనున్నట్లు, ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. అలాగే, రూ.8 వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు తుది దశకు వచ్చాయని మంత్రి వెల్లడించారు. 

ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్‌‌‌‌‌‌‌‌ పోర్ట్ వరకు రూ.20 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించబోతున్నామని, ఈ రహదారి అందుబాటులోకి వస్తే అభివృద్ధిలో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని చెప్పారు. భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 

వీటితో పాటు అదనంగా మరో రూ.28 వేల కోట్లతో చేపట్టనున్న పనులు ప్రతిపాదన దశల్లో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఆయా రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే నిధుల సమీకరణకు సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.