- బీజేపీ అండతో బీఆర్ఎస్ దొంగ ఓట్లను నమోదు చేయించింది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌లోనూ ఓట్ల చోరీ జరిగిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్‌లో పక్క నియోజకవర్గ ఓటర్లను పెద్ద సంఖ్యలో నమోదు చేయించారు. బీజేపీ అండతోనే ఈ నియోజకవర్గంలో దొంగ ఓట్లను బీఆర్ఎస్ నమోదు చేయించింది. అందువల్లనే ఆ పార్టీ ఇక్కడ వరుసగా మూడుసార్లు గెలిచింది” అని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకొని మోదీ సర్కార్ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి పాల్పడుతున్నదని ఆయన మండిపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓట్లను దొంగలిస్తూ బీజేపీ అధికారంలో కొనసాగుతున్నదని ఫైర్ అయ్యారు. ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఓట్ల చోరీ జరిగిందనే వివరాలను తాము ఆధారాలతో సహా తెలియజేసినా కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉండడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కొనసాగుతున్నదని, మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో సంతకాల సేకరణ జరిగిందని, ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.
మోదీకి తొత్తుగా ఈసీ: మీనాక్షి
కేంద్ర ఎన్నికల సంఘాన్ని తమ గెలుపు కోసం ప్రధాని మోదీ వాడుకుంటున్నారని, అందుకే దేశంలోని పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. ఓట్ల చోరీ పెద్ద ఎత్తున జరగడంతోనే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి జనాభిప్రాయం ప్రకారం ఫలితాలు రాలేదన్నారు. ఏ రాష్ట్రంలో ఎలా ఓట్ల చోరీ జరిగిందనే వివరాలను రాహుల్ గాంధీ ఆధారాలతో సహా చూపించినా కేంద్ర ఎన్నికల సంఘం ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు.
ఈసీ వంటి స్వతంత్ర సంస్థ సైతం మోదీకి తొత్తుగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఫైర్ అయ్యారు. ‘‘ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతున్నది. దీనిపై ఈ నెలాఖరులో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచే నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రెసిడెంట్ ముర్మును కలిసి సంతకాల సేకరణ కాపీలను అందజేస్తాం” అని తెలిపారు.
