
- ఇప్పటికే 2,628 మంది బాధితులు
- హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు
- రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు కిటకిట
- ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలం!
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో విష జ్వరాలు ముసురుతున్నయ్. రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు 67 వేల మంది విష జ్వరాల బారినపడినట్లు ప్రభుత్వ దవాఖాన్ల లెక్కలు చెబుతున్నాయి. అయితే వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలు జిల్లాల్లో ‘హైరిస్క్’ పరిస్థితి ఉందనే ముందే ప్రకటించినా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.
మలేరియా భయపెడుతోంది..
జూన్ వరకూ పెద్దగా కనిపించని మలేరియా, ఇప్పుడు విజృంభిస్తోంది. జూన్ చివరి నాటికి కేవలం 568 మలేరియా కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 2,628కి చేరింది. గడిచిన 40 రోజుల్లోనే 2,060 మందికి ఈ వ్యాధి సోకింది. 2015 తర్వాత మళ్లీ ఈ ఏడాది అత్యధిక మలేరియా కేసులు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2015లో రాష్ర్టంలో 11,880 మంది మలేరియా బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అప్పటినుంచి ఏటా వ్యాధి తీవ్రత తగ్గుతూ వచ్చింది. గతేడాది 1,792 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మే నుంచి ఇప్పటి దాకా 5,116 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. కలుషిత మంచి నీరు, అపరిశుభ్ర వాతావరణం కారణంగా 89 వేల మంది డయేరియాతో ఆస్పత్రుల పాలయ్యారు.
చర్యలేవి?
వర్షకాలం అనగానే ఏజెన్సీ ప్రాంతాలున్న జిల్లాల్లో రివ్యూ మీటింగ్ నిర్వహించడం, ఏజెన్సీ ఏరియాల్లో దోమ తెరల పంపిణీ, లార్వా నాశనం చేసేందుకు మందులను పిచికారి చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా 10 ఏజెన్సీ జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఈటల రాజేందర్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, వరంగల్ రూరల్, కరీంనగర్, భూపాలపల్లి, రంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, మేడ్చల్, నిజామాబాద్‌లను డెంగీ హైరిస్క్ జిల్లాలుగా, భూపాలపల్లి, కొత్తగూడెం, హైదరాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్‌లను మలేరియా హైరిస్క్‌గా జిల్లాలుగా ప్రకటించారు. ఈ జిల్లాల్లో హైరిస్క్ అని ముందే తెలిసినా కనీసం వ్యాధి నివారణకు చర్యలు పగడ్బందీగా తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనే 70% మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో మలేరియా కంట్రోల్ యూనిట్ ఉన్నా.. అది నిరుపయోగంగానే మారింది. మొత్తం 2,628 మలేరియా కేసుల్లో 1,886 ఇక్కడే నమోదయ్యాయి. 639 కేసులతో కరీంనగర్ రెండో స్థానంలో ఉంది.
మంత్రి ఆదేశాలు అమలైతలేవ్
సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ దవాఖాన్లలో పని చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే ఆయన ఆదేశాలను డాక్టర్లు, సిబ్బంది లైట్ తీసుకున్నారు. అసలు అలాంటి ఆదేశాలేవీ అమలు కావడం లేదని ప్రజారోగ్య విభాగం ఉన్నతాధికారులు చెబుతుండడం గమనార్హం. ఓ వైపు వేల మంది ప్రజలు రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతుండటం, వ్యాధులు మరింత విస్తరించే ప్రమాదముందని తెలిసి కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగుల సంఖ్య భారీగా పెరుగుతున్నా.. ఉన్నతాధికారులు కనీసం ఓ సమీక్ష కూడా నిర్వహించకపోవడం గమనార్హం.
మన్యానికి జ్వరం
భద్రాచలం, వెలుగు: భద్రాచలం మన్యానికి జ్వరం పట్టుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రతి పీహెచ్‍సీ పరిధిలో చికిత్స పొందుతున్న 10 మంది రోగుల్లో కనీసం ముగ్గురు విషజ్వరంతో బాధపడుతున్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఉన్న ప్రతి 100 మంది రోగుల్లో 30 మంది జ్వరంతో బాధపడుతున్నా వారే. మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామానికి చెందిన ప్రమీల, ఈమె సోదరుడు సందీప్ జ్వరంతో ఇటీవల భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేరారు. ఒళ్లంతా నొప్పులు, భరించలేని తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. మణుగూరు ఏరియా ఆసుపత్రిలో అసలు వైద్యులే లేరని, అందుకే తాము భద్రాచలం ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నట్లుగా ప్రమీల చెప్పింది. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత సమస్యను వీరిద్దరి పరిస్థితి తెలియజేస్తోంది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 74 మంది డాక్టర్లు ఉండాలి. కానీ 14 మందే ఉన్నారు.
హైదరాబాద్లో వేలాది మంది
హైదరాబాద్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, నుమోనియాతో జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గత మూడు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగుల సంఖ్య వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిన వారి సంఖ్యను కూడా కలిపితే ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ పెద్దాస్పత్రులన్నీ గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఉండటంతో రాష్ట్రంలోని చాలా మంది విష జ్వరాలకు చికిత్స కోసం వస్తున్నారు. హైదరాబాద్లో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమని చెబుతున్నారు. మరోవైపు బస్తీ దవాఖానాలు, క్లినిక్ లు, నర్సింగ్ హోమ్ లు, ఏరియా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్.. ఇలా ఎక్కడ చూసినా రోగులు ఓపీల వద్ద క్యూ కడుతున్నారు. ఓపీల్లో 70 శాతం వైరల్ ఫీవర్ బాధితులే ఉన్నారని డాక్టర్లు చెప్తున్నారు.
జ్వరం ఇడుస్త లేదు
15 దినాల సంది జ్వరం ఇడుస్త లేదు. సర్కారు దవాఖానలో ఇచ్చిన మందులు వేసుకుంటున్న. పగలు జ్వరం తగ్గినట్టే అనిపిస్తంది. రాత్రికి మళ్లీ వస్తంది. చలితో వణికిపోతున్న. మా ఊల్లో నీళ్లు ఎక్కడివక్కడే ఆగుతున్నయి. తాగే నీళ్లు కూడా ఎర్రగ వస్తున్నయి. అవి తాగి అందరికీ రోగాలొస్తున్నయి. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేయించుకున్న. ప్రైవేట్ దవాఖానలో కూడా చూపించుకున్న. అయినా ఇడుస్త లేదు. మా తండాలో రోజుకు ఒకరిద్దరికి టైఫాయిడ్ వస్తాంది.-
–గౌడనాయక్, దావాజిపల్లి తండా, వనపర్తి జిల్లా