హిమాచల్ అసెంబ్లీలో ఏకైక మహిళా ఎమ్మెల్యే

హిమాచల్ అసెంబ్లీలో ఏకైక మహిళా ఎమ్మెల్యే

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 24 మంది మహిళలు పోటీ చేయగా కేవలం ఒక్కరు మాత్రమే గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆరు, కాంగ్రెస్ అయిదుగురు, ఆమ్ ఆద్మీ ముగ్గురు మ‌హిళ‌లను బరిలోకి దించాయి. అయితే ఇందులో ఒక్క మ‌హిళ మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ నుంచి పచాడ్ (ఎస్సీ) అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన రీనా కశ్యప్ విజయం సాధించారు. దీంతో  68 మంది ఎమ్మెల్యేలు ఉండే రాష్ట్ర శాసనసభలో ఒక్క మహిళకే చోటు దక్కింది.

కాంగ్రెస్ అభ్యర్థి దయాళ్ ప్యారీపై రీనా కశ్యప్ 3,857 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రీనాకు మొత్తం 21,215 ఓట్లు రాగా, దయాళ్ ప్యారీకి 17,358 ఓట్లు వచ్చాయి. ఆప్ నుంచి పోటీ చేసిన అజయ్‌సింగ్‌కు కేవలం 568 ఓట్లు మాత్రమే వచ్చాయి. 12 వేల 946 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి గంగూరాం మూడో స్థానంలో నిలిచారు. 

ఇక్కడ అసక్తికరమైన విషయం ఏంటంటే.. 1998 ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్ల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. గత ఐదు ఎన్నికలలో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం 76.8 శాతం కాగా పురుషుల ఓటింగ్ శాతం 72.4 శాతంగా ఉంది. 

2019లో పచ్చడ్‌లో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ నుంచి తొలిసారి పోటీ చేసి రీనా కశ్యప్‌ గెలుపొందారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సురేష్ కశ్యప్ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటుకు వెళ్లడంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు అక్కడి నుంచి మరోసారి గెలిచి తిరిగి సిట్టింగ్ స్థానాన్ని రీనా కశ్యప్ కైవసం చేసుకున్నారు.