
- అఖిలపక్ష ఎంపీల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం
- అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో పది రోజుల పాటు టూర్
- పాక్ తీరును ఎండగట్టి.. ఆపరేషన్ సిందూర్,భవిష్యత్తు చర్యలను వివరించనున్న ఎంపీలు
- ఎన్డీఏ ఎంపీల నాయకత్వంలో 4, ఇండియా కూటమి ఎంపీల ఆధ్వర్యంలో 3 టీంలు
- రవిశంకర్ ప్రసాద్, శశిథరూర్, ఇతరుల నేతృత్వంలో బృందాలు
- తెలుగు రాష్ట్రాల నుంచి అసదుద్దీన్ ఒవైసీ, పురందేశ్వరి, మరో ఇద్దరికి చోటు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దౌత్య యుద్ధానికి తెరతీసింది. పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిల పక్ష ఎంపీలతో 7 ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. అధికార ఎన్డీయే కూటమి నుంచి నలుగురు ఎంపీలు, ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి ముగ్గురు ఎంపీలు ఈ బృందాలకు నాయకత్వం వహించనున్నారు. అన్ని బృందాల్లో ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు సభ్యులుగా ఉంటారు.
భారత్ కు కీలకమైన భాగస్వాములుగా ఉన్న అమెరికా, బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, తదితర దేశాల్లో పర్యటించనున్న ఈ బృందాలకు రవి శంకర్ ప్రసాద్ (బీజేపీ), బైజయంత్ పండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), శ్రీకాంత్ షిండే(శివ సేన), శశిథరూర్ (కాంగ్రెస్), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్ సీపీ ఎస్పీ) నేతృత్వం వహించనున్నారని ఈ మేరకు శనివారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ‘ఎక్స్’లో ప్రకటించారు.
‘‘అత్యంత క్లిష్టమైన ప్రస్తుత సమయంలో భారత్ ఐక్యంగా నిలిచింది. త్వరలోనే 7 అఖిలపక్ష ప్రతినిధి బృందాలు కీలక భాగస్వామ్య దేశాల్లో పర్యటిస్తాయి. టెర్రరిజంపై మన పోరాటాన్ని ఆయా దేశాలకు వివరిస్తాయి. రాజకీయాలు, అభిప్రాయభేదాలను పక్కనపెట్టి యావత్తు దేశమంతా టెర్రరిజానికి వ్యతిరేకంగా నిలబడిందన్న విషయాన్ని తెలియజేస్తాయి”అని ఆయన తెలిపారు.
భద్రతా మండలి సభ్యులకూ వివరణ..
టెర్రరిజంపై పోరాటంలో భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, ఈ విషయంలో దేశమంతా ఏకతాటిపై ఉందన్న సందేశాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకే కేంద్రం ప్రతినిధి బృందాలను పంపిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులకు కూడా పాక్ దుర్మార్గాన్ని ఆధారాలతో సహా ఈ బృందాలు తెలియజేస్తాయి. పహల్గాం ఉగ్రదాడితో 26 మంది అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకున్న తీరును, పాక్‌లోని టెర్రర్ క్యాంపులపై చేసిన దాడులను, భవిష్యత్తులో మళ్లీ ఉగ్ర దాడి జరిగితే చేపట్టే చర్యలను ఆయా దేశాలకు వివరిస్తాయి” అని కేంద్రం పేర్కొంది. కాగా, ఈ బృందాలు మే 22 లేదా 23 నుంచి పది రోజులపాటు ఆయా దేశాల్లో పర్యటించనున్నట్టు సమాచారం.
ప్రతి టీంలోనూ ఆరు నుంచి ఏడుగురు..
ప్రతి బృందంలోనూ ఆరు నుంచి ఏడుగురు అఖిలపక్ష ఎంపీలు ఉంటారు. ఒక్కో టీం 4 నుంచి 5 దేశాల్లో పర్యటిస్తుంది. ఆయా బృందాల్లో అనురాగ్ ఠాకూర్, అపరాజితా సారంగి, మనీశ్ తివారీ, అమర్ సింగ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, సమిక్ భట్టాచార్య, బ్రిజ్ లాల్, సర్ఫరాజ్ అహ్మద్, ప్రియాంక చతుర్వేది, విక్రమ్ జిత్ సాహ్నీ, సస్మిత్ పాత్రా, భుబనేశ్వర్ కలిటా, నిశికాంత్ దూబే, బన్సూరి స్వరాజ్, ఎంజే అక్బర్, ఎస్ఎస్ అహ్లూవాలియా, గులాం నబీ ఆజాద్, జాన్ బ్రిటాస్, తదితర ఎంపీలు సభ్యులుగా ఉన్నారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్ ఎంపీ కాకపోయినా.. సంజయ్ ఝా టీంలో సభ్యుడిగా ఉన్నారు. టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయను చేర్చినా.. అనారోగ్య కారణాల వల్ల తిరస్కరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి అసదుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం), దగ్గుబాటి పురందేశ్వరి (బీజేపీ),
లావు కృష్ణ దేవరాయలు (టీడీపీ), గంటి హరీశ్ మధుర్ (టీడీపీ)కు చోటు దక్కింది.
శశిథరూర్ ఎంపికపై కాంగ్రెస్ ఫైర్
కాంగ్రెస్ పార్టీని సంప్రదించకుండానే శశి థరూర్‌ను ఓ బృందానికి లీడర్‌గా కేంద్రం ప్రకటించిందని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ తప్పుపట్టారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రం విజ్ఞప్తి మేరకు గౌరవ్ గొగొయ్, ఆనంద్ శర్మ, సయ్యద్ నజీర్ హుస్సేన్, రాజా బ్రార్ పేర్లను సూచించారు. వీరిలో ఆనంద్ శర్మ పేరును మాత్రమే కేంద్రం చేర్చింది. కొత్తగా శశి థరూర్‌ను కేంద్రం చేర్చింది. ఒకవేళ ఆయనను చేర్చాలని భావిస్తే ముందుగా కాంగ్రెస్ పార్టీతో సంప్రదించాల్సింది” అని అన్నారు. అయితే, జైరాం కామెంట్లపై బీజేపీ విమర్శలు గుప్పించింది.
ఏయే దేశాలకు ఎవరంటే..
శశిథరూర్ బృందం: యూఎస్ఏ, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా
రవిశంకర్ ప్రసాద్ టీం: బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్
సుప్రియా సూలే బృందం: సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఖతర్, ఇథియోపియా
సంజయ్ ఝా టీం: ఇండోనేసియా, మలేసియా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్
గౌరవంగా భావిస్తున్నా: శశిథరూర్
కేంద్ర ప్రభుత్వం తనను అఖిలపక్ష బృందానికి నాయకుడిగా నియమించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ‘‘దేశ ప్రయోజనానికి సంబంధించిన విషయంలో నా సేవలు అవసరమైనప్పుడు, నేను తప్పకుండా అందుబాటులో ఉంటాను” అని ఆయన చెప్పారు. అయితే, ప్రతినిధి బృందాల్లో చేర్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన పేర్లపై తాను స్పందించబోనని చెప్పారు. ‘‘మమ్మల్ని నాలుగు పేర్లు ఇవ్వాలని అడిగారు. మేం నాలుగు పేర్లు ఇచ్చాం. అంతేతప్ప ఎవరి గురించీ నేను మాట్లాడను” అని ఆయన స్పష్టం చేశారు.