పోలీసు ట్రైనింగ్ సెంటర్‎పై బాంబ్ ఎటాక్: ఏడుగురు పోలీసులు, ఆరుగురు ఉగ్రవాదులు మృతి

పోలీసు ట్రైనింగ్ సెంటర్‎పై బాంబ్ ఎటాక్: ఏడుగురు పోలీసులు, ఆరుగురు ఉగ్రవాదులు మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శుక్రవారం (అక్టోబర్ 10) రాత్రి డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని రట్ట కులాచి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‎ను లక్ష్యంగా చేసుకుని ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కును పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మొయిన్ గేటును ఢీకొట్టారు. 

దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా బలగాలు కౌంటర్ ఆపరేషన్ చేపట్టాయి. దాదాపు ఐదు గంటల పాటు ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులు, ఏడుగురు పోలీసులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 13 మంది పోలీసులు గాయపడి చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

ఈ ఆపరేషన్‌ను ఎస్ఎస్‎జీ కమాండోలు, అల్-బుర్క్ ఫోర్స్, ఎలైట్ ఫోర్స్, స్థానిక పోలీసు విభాగాలు సంయుక్తంగా నిర్వహించాయని వెల్లడించారు. డీపీఓ డేరా ఇస్మాయిల్ ఖాన్ సాహిబ్జాదా సజ్జాద్ అహ్మద్, ఆర్పీఓ సయ్యద్ అష్ఫాక్ అన్వర్ స్వయంగా ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కును పోలీస్ శిక్షణా కేంద్ర ప్రధాన ద్వారానికి ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. 

ఈ దాడి నుంచి పోలీసులు తేరుకునే లోపే ఉగ్రవాదులు పోలీస్ యూనిఫాంలు ధరించి ట్రైనింగ్ సెంటర్లోకి చొరబడి విచక్షణరహితంగా కాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు. దాదాపు ఐదు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయని.. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున గ్రెనేడ్లు విసిరారని తెలిపారు. చివరకు ఈ ఆపరేషన్ లో ఏడుగురు పోలీసులు మరణించగా.. ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వెల్లడించారు.