మత్తు కోసం సిరప్ తాగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

మత్తు కోసం సిరప్ తాగి ఒకే కుటుంబానికి చెందిన  ఏడుగురు మృతి

ఛత్తీస్‌‌ఘర్‌లో దారుణం జరిగింది. అధిక ఆల్కహాల్ మోతాదు ఉన్న సిరప్ తాగడం వల్ల ఏడుగురు మరణించారు. ఈ దారుణ ఘటన బిలాస్‌పూర్ జిల్లాలోని కోర్మి గ్రామంలో వెలుగుచూసింది.  మద్యానికి బానిసైన కొంతమంది.. మత్తుకోసం సిరప్ తాగడంతో ఈ ఘటన జరిగింది.

సిర్గిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్మి గ్రామానికి చెందిన ఒక కుటుంబం స్థానికంగా ఉన్న ఓ హోమియోపతి వైద్యుడిని కలిశారు. ఆ వైద్యుడు వారికి  ద్రోసెరా -30 అనే సిరప్ ఇచ్చాడు. అది తాగిన ఆ కుటుంబంలోని నలుగురు మంగళవారం రాత్రి చనిపోగా.. మరో ముగ్గురు బుధవారం మధ్యాహ్నం మరణించినట్లు బిలాస్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కమలేష్ ధూరి (32), అక్షి ధురి (21), రాజేష్ ధూరి (21), సమ్రూ ధూరి (25) మంగళవారం రాత్రి వైద్యుడు ఇచ్చిన సిరప్‌ను తాగారు. ఆ సిరప్‌లో సుమారు 91 శాతం ఆల్కహాల్ ఉందని.. అందువల్లే వారి ఆరోగ్యం విషమించి చనిపోయారని ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. 

వీరంతా కరోనా వల్లే మరణించారని అనుమానించిన కుటుంబసభ్యులు.. అధికారులకు సమాచారమివ్వకుండా మరుసటి రోజు ఉదయం వారి చివరి కర్మలు చేశారు. అనంతరం అదే సిరప్ తాగిన ఖేమ్‌చంద్ ధూరి (40), కైలాష్ ధూరి (50), దీపక్ ధూరి (30) కూడా అనారోగ్యం బారినపడ్డారు. దాంతో వారిని వెంటనే బిలాస్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఈ ముగ్గురు చికిత్స పొందుతూ చనిపోయారు. 

వీరి మరణాల గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఓ పోలీసు బృందం బుధవారం సాయంత్రం గ్రామానికి చేరుకొని దర్యాప్తు చేపట్టింది. అదే సిరప్ తాగిన మరో ఐదుగురిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి సమీపంలో ఉన్న హోమియోపతి ప్రాక్టీషనర్ వీరందరికీ ఈ సిరప్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందని పోలీస్ సూపరింటెండెంట్ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. దాంతో ఆ వైద్యుడి మీద కేసు నమోదు చేసి.. వైద్యుడి కోసం గాలింపు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.