సంసద్​ ఆదర్శ్​ యోజనతో ప్రగతి బాటలో పల్లెలు

సంసద్​ ఆదర్శ్​ యోజనతో ప్రగతి బాటలో పల్లెలు

కామారెడ్డి/సైదాపూర్/గన్నేరువరం/వీణవంక, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకం సంసద్​ఆదర్శ్​ యోజనతో రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న పల్లెలు నేడు అన్ని సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తున్నాయి. సంసద్ ఆదర్శ్ యోజన కింద ఎంపిక చేసిన గ్రామాల్లో కరీంనగర్​జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామం నేషనల్​ లెవల్​లో ఫస్ట్​ప్లేస్​లో నిలిచింది. ఈ గ్రామ జనాభా 2,167. రాజ్యసభ సభ్యుడు  కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు 2014–-15లో వెన్నంపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.  రూ. 1.5 కోట్లు ఎంపీ ఫండ్స్​ మంజూరు చేశారు. పల్లె ప్రగతి కింద వచ్చిన నిధులనూ గ్రామస్తులు సద్వినియోగం చేసుకున్నారు. గ్రామంలోని అన్ని కాలనీలలో సీసీ రోడ్లు నిర్మించారు. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేయగా పనులు పూర్తికావచ్చాయి.  గ్రామంలో రూ. 4 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రూ. 20 లక్షలతో మహిళా సంఘ భవనాన్ని నిర్మించుకున్నారు.  రూ. 16 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య భవనం, రూ. 12 లక్షలతో మురుగు కాలువల నిర్మాణాలు పూర్తి చేశారు.  గ్రామంలో ఉపాధి కల్పన పథకం ద్వారా మహిళా సంఘాల కుటుంబ సభ్యులకు  స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి 60 మందికి కుట్టు మెషిన్​ శిక్షణ ఇప్పించారు.   ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ప్రాథమిక పశువైద్య కేంద్రం భవనాలు నిర్మించుకున్నారు.  గ్రామంలో పెట్రోల్ బంక్ ను కూడా నిర్వహిస్తున్నారు.  గ్రామంలో రూ. 65 వేలతో తడి, పొడి చెత్త బుట్టలను కొనుగోలు చేసి ప్రతి ఇంటికీ పంపిణి చేశారు.  ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి రోజు తడి పొడి చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా సెగ్రిగేషన్ షెడ్ కు తరలిస్తున్నారు.  ఇలా సేకరించిన తడి పొడి చెత్తను వేరుచేసి కంపోస్టు ఎరువు తయారు చేసుకుంటున్నారు.

టాప్​టెన్​లో ఏడు మనవే..
‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన(ఎస్ఏజీవై)’లో నేషనల్​ లెవల్​లో టాప్​టెన్ ​స్థానాల్లో నిలిచిన పల్లెల్లో 7 మన రాష్ట్రంలోనివే. దేశవ్యాప్తంగా ఈ స్కీమ్​ కింద తీసుకున్న గ్రామాల్లో ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు చెందిన గ్రామాలు 4, ఉమ్మడి నిజామాబాద్​కు చెందిన 3 గ్రామాలు టాప్​టెన్​లో నిలిచాయి. ఉమ్మడి కరీంనగర్​కు చెందిన సైదాపూర్​మండలం వెన్నంపల్లి గ్రామం నేషనల్​లెవల్​లో ఫస్ట్​ ప్లేస్​ సాధించగా బెజ్జంకి మండలం గన్నేరువరం 4, ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి 6, వీణవంక మండలం రామకృష్ణాపూర్​ 9, ఉమ్మడి నిజామాబాద్​జిల్లా జుక్కల్ ​మండలం కౌలాస్​ గ్రామం 2, రెంజల్​ మండలం కందకుర్తి 5, నిజామాబాద్​ మండలం తానాకుర్ద్  గ్రామం 10వ స్థానంలో నిలిచాయి. 

మారుమూల గ్రామమైనా..
కామారెడ్డి జిల్లా జుక్కల్  మండలం  కౌలాస్ గ్రామం మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల బార్డర్​లో ఉంది. గ్రామ జనాభా 2,188. మారుమూలలో ఉన్న ఈ గ్రామాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దత్తత తీసుకున్నారు. మరోవైపు వెనుకబడిన ఏరియాల్లోని గ్రామాల్లో పట్టణస్థాయి వసతులు కల్పించేందుకు  కేంద్ర ప్రభుత్వం రూర్బన్  డెవలప్​మెంట్ ​స్కీమ్  తీసుకొచ్చింది. ఈ స్కీమ్​లో జుక్కల్ మండలం కూడా ఉంది.  కౌలాస్​కు అటు  సంసద్ ఆదర్శ్​ గ్రామ యోజన,  ఇటు రూర్బన్ డెవలప్​మెంట్ ​స్కీమ్ కలిసి వచ్చాయి. దీంతో ఇక్కడ ఐదేళ్లలో రూ. 10 కోట్ల మేర ఫండ్స్​తో డెవలపెంట్​వర్క్స్ జరిగాయి. ఒక ఊరికి కావాల్సిన అన్ని రకాల వసతులు సమకూరాయి. స్కూల్ బిల్డింగ్, కాంపౌండ్ వాల్,  రెండు అంగన్వాడీ బిల్డింగులు, లైబ్రరీ బిల్డింగ్, హెల్త్ సబ్ సెంటర్, వెటర్నరీ హాస్పిటల్ బిల్డింగ్, పశువులకు నీటి తొట్ల నిర్మాణం, బస్ షెల్టర్, సోలార్ వీధి లైట్లు, పంచాయతీ బిల్డింగ్, పిల్లలకు ఆట పరికరాలు, హాస్టల్ బిల్డింగ్, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం,  మంకీ కోర్టుతో పాటు గ్రామానికి ఇరు వైపులా ఉన్న రోడ్ల వెంట  మొక్కల పెంపకం చేపట్టడంతో పచ్చదనాన్ని సంతరించుకుంది.  ప్రతి ఇంటిలో ఇంకుడుగుంత,  వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. పంట ఉత్పత్తుల నిల్వకు గోదాం నిర్మించారు. 80 మంది రైతులకు పశువులు ఇచ్చారు. 8 మందికి  పొలాల్లో బోర్లు తవ్వించి కరెంటు కనెక్షన్లు ఇచ్చారు. గ్రామాల్లో ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం 36 ఆంశాలకు సంబంధించి పరిశీలన చేయగా  కౌలాస్  దేశంలో  రెండో స్థానంలో నిలిచింది. 

అందరి సహకారంతోనే..
మా గ్రామం ఆదర్శంగా నిలిచినందుకు, దేశంలోనే మంచి పేరు సాధించినందుకు ఆనందంగా ఉంది. అందరి సహకారంతోనే గ్రామంలో పథకాల అమలు సాధ్యమైంది. మరింత పోటీతత్వంతో ముందుకు పోతాం. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే సతీశ్ కుమార్, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావుల సహకారం మరువలేనిది. 
- అబ్బిడి పద్మ, సర్పంచ్, వెన్నంపల్లి

అన్ని వసతుల ఏర్పాటు
గన్నేరువరం గ్రామాన్ని అప్పటి ఎంపీ వినోద్ కుమార్ సంసద్ ఆదర్శ్​ యోజన కింద దత్తత తీసుకోవడంతో ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. పల్లె ప్రగతి ఫండ్స్​తోడవడంతో గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన అన్ని నిర్మాణాలు వేగంగా పూర్తి  చేసుకోగలిగాం. 100 శాతం ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించాం. రైతులకు సిమెంటు కల్లాలు, పశువుల పాకలు, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం, వార సంత అన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశంలోనే గ్రామం 4వ ప్లేస్​సాధించడంతో సంతోషంగా ఉంది.  
- పుల్లెల లక్ష్మి, సర్పంచ్, గన్నేరువరం

సంతోషంగా ఉంది
మా ఊరు దేశంలో  రెండో స్థానం పొందటం సంతోషంగా ఉంది. ఎంపీ బీబీ పాటిల్ దత్తత తీసుకోవటంతో పాటు, రూర్బన్ ఫండ్స్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే స్పెషల్​గా ఫండ్స్ ఇవ్వటంతో గ్రామాన్ని డెవలప్​ చేశాం.  దీనికి అందరూ సహకరించారు. ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు, ఆఫీసర్లు, గ్రామస్తుల సహకారంతో డెవలప్​మెంట్​జరిగింది.
- హన్మండ్లు యాదవ్,  సర్పంచ్, కైలాస్, కామారెడ్డి జిల్లా