పత్తి కొనుగోళ్లలో 7 క్వింటాళ్ల నిబంధన ఎత్తేయాలి: పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ

పత్తి కొనుగోళ్లలో 7 క్వింటాళ్ల నిబంధన ఎత్తేయాలి: పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ
  • తేమ పరిమితి సైతం 20% వరకు సడలించాలి
  • కేంద్ర మంత్రి గిరి రాజ్​సింగ్కు లేఖ

పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలో పత్తి సగటు దిగుబడి 11.74 క్వింటాళ్లు ఉండగా.. సీసీఐ మాత్రం కేవలం 7 క్వింటాళ్లే కొనడం అన్యాయమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. వెంటనే ఈ నిబంధనను ఎత్తివేసి గతంలో మాదిరిగా ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. 

తేమ పరిమితిని సైతం 20% వరకు సడలించాలని.. మిల్లర్లు, ట్రేడర్స్​అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌‌‌‌కు మంగళవారం లేఖ రాశారు. ‘‘2025-–26 పత్తి కొనుగోలు సీజన్ లో రాష్ట్ర సగటు పత్తి దిగుబడి 11.74 క్వింటాళ్లుగా ఉంది. రాష్ట్ర వ్యవసాయశాఖ ఇదే విషయాన్ని సీసీఐకి నివేదించింది. కానీ, కేంద్రం దీనిని 7 క్వింటాళ్లకు తగ్గించింది. ఇది రైతులను మోసం చేయడమే’’ అని లేఖలో ఎంపీ పేర్కొన్నారు.

ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల టన్నుల పత్తి పంట దిగుబడి వస్తే.. సీసీఐ ఇప్పటివరకు కేవలం 1.18 లక్షల టన్నుల పత్తి మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. ఇప్పటికే మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులు సీసీఐ పెట్టిన తేమ నిబంధనతో మరింత నష్టపోతున్నారని.. 20‌‌‌‌‌‌‌‌ శాతం తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ వంశీ కృష్ణ సూచించారు. అలాగే, జిన్నింగ్​మిల్లుల యజమానులు, ట్రేడర్స్​వెల్ఫేర్ అసోసియేషన్ లేవనెత్తిన స్లాట్​బుకింగ్,  ఎల్ 1, ఎల్​2 విభజన సమస్యలను పరిష్కరించి పత్తి కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని లేఖలో కేంద్రమంత్రికి ఎంపీ విజ్ఞప్తి చేశారు.