
హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ సిటీలో వెహికల్స్ పార్కింగ్ సమస్య తీవ్రంగా మారింది. సిటీలో 70 శాతం కమర్షియల్ కాంప్లెక్సుల్లో ఇప్పటికీ పార్కింగ్ స్థలాలు లేవు. రోజురోజుకు వెహికల్స్ సంఖ్య పెరుగుతుండటంతో పార్కింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు ఇంటి నుంచి బైక్ లేదా కారు బయటికి తీయాలంటే ట్రాఫిక్ జామ్‌లకు భయపడేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక వాహనదారులు టెన్షన్ పడే పరిస్థితి నెలకొంది. రోడ్డు వెంట పా ర్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు భారీగా ఫైన్లు విధిస్తుండటం, పార్కింగ్‌కు ఇబ్బంది ఉన్న ఏరియాల్లో ఏదైనా పనిపై వెళ్లినా హడావుడిగా ముగించుకోవాల్సివస్తుండటంతో సొంత వెహికల్స్ లో వెళ్లేందుకు సిటిజన్లు ఇష్టపడటం లేదు.
2001లో ప్రతి వెయ్యి మందికి 103 వెహికల్స్ ఉండగా, 2011లో ఆ సంఖ్య 279కు చేరింది. ప్రస్తుతం ప్రతి వెయ్యి మందికి 500 వెహికల్స్ ఉన్నట్లు పలు సంస్థలు నిర్వహించిన సర్వేలు చెప్తున్నాయి. ప్రస్తుతం పార్కింగ్ సమస్య తీరేందుకు దాదాపు 3 వేల ఎకరాల స్థలం అవసరమని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. కమర్షియల్ కారిడార్ల సంఖ్యను పెంచుతున్న జీహెచ్ఎంసీ.. పార్కింగ్ ఫెసిలిటీ కల్పించడంపై దృష్టి పెట్టకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పట్లేదు. కోఠి, సికింద్రాబాద్, చార్మినార్, ఎల్ బీనగర్, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, రాణిగంజ్, ఉస్మాన్‌గంజ్, బేగంబజార్.. లాంటి రద్దీ ఏరియాల్లో పార్కింగ్ కోసమే గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తోందని వాహనదారులు చెప్తున్నారు.
మల్టీలెవల్ పార్కింగ్‌ల ఊసే లేదు
పార్కింగ్ తో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించాలని కొన్నేళ్లుగా అధికారులు చెబుతూనే ఉన్నారు. కానీ వాటి నిర్మాణం దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 42 ప్రాంతాల్లో పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి భూములను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో ఆయా శాఖలు తమ అవసరాలతో పాటు కమర్షియల్, పార్కింగ్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు ఇవ్వాలని 2018 జూన్‌లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఆదేశించారు. ప్రతి పార్కింగ్ కాంప్లెక్స్‌ను
యూనిట్ గా అభివృద్ధి చేయాలని, కమర్షియల్ అంశాలను దృష్టిలో ఉంచుకొని, ప్యాకేజీల వారీగా ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించినా నేటికీ కాంప్లెక్స్‌ల నిర్మాణం జరగలేదు. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేట్ భూములను తీసుకొని నిర్మిస్తామన్నప్పటికీ ఆ విషయంపైనా దృష్టి పెట్టలేదు. కిందటేడాది జనవరి 21న జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సైతం సమావేశం నిర్వహించారు. తొందరలోనే మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణ పనులు స్టార్ట్ చేస్తామని చెప్పినా ఇప్పటికీ మొదలుకాలేదు.
పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే ఫిర్యాదు ఇలా..
పార్కింగ్ సమస్య ఒకటైతే.. మరోవైపు షాపింగ్ మాల్స్, ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. నిర్మాణ సమయంలో బిల్డింగ్ స్పేస్‌లో 40 శాతం పార్కింగ్ కు కేటాయిస్తున్నట్లు చెప్పి నిర్మాణదారులు పర్మిషన్ తీసుకుంటారు. ఆ స్పేస్ పార్కింగ్ కోసం కేటాయిస్తున్నప్పుడు పార్కింగ్ ఫీజు చెల్లించే అవసరం లేదని ప్రభుత్వ ఉత్తర్వులు చెప్తున్నాయి.ఎక్కడైనా పార్కింగ్‌ఫీజు వసూలు చేస్తే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఫీజు వసూలు చేసిన వారికి రూ.50 వేల ఫైన్ విధిస్తారు. దీని కోసం పార్కింగ్రసీదుతో లేదా షాపింగ్, హాస్పిటల్స్ బిల్లుతో
జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్ మెంట్ ట్విట్టర్‌కు లేదా బల్దియా సర్కిల్ ఆఫీసులోని డిప్యూటీ కమిషనర్‌కు కంప్లయింట్ చేయొచ్చు. సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 040–21111111 కు కాల్ చేయొచ్చని అధికారులు చెప్తున్నారు.
కమర్షియల్ కారిడార్లను పెంచినా..
కమర్షియల్ కారిడార్లపై వస్తున్న ఆదాయంపై బల్దియా అధికారులు ఫోకస్ చేస్తున్నారే తప్ప అక్కడ ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్‌ను పట్టించుకోవడం లేదు. గ్రేటర్లో గతంలో 66 కమర్షియల్ రోడ్లు ఉండగా, తాజాగా మరో 118 రోడ్లను కమర్షియల్ చేశారు.
ఈ ప్రాంతాల్లో నిర్మాణ పర్మిషన్లకు, వ్యాపార సముదాయలకు తీసుకునే పర్మిషన్ ఫీజులు సైతం పెరిగాయి. ట్యాక్స్‌లు చెల్లించని వారికి నోటీసులు సైతం జారీ చేస్తున్నారు. కానీ షాపింగ్ చేసేందుకు వచ్చే వారు పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వెహికల్స్ ను ఉంచి వెళ్తున్నారు. అబిడ్స్‌లోని జీపీవో, చార్మినార్‌లోని మదీనా సర్కిల్ లో బల్దియా పార్కింగ్ స్థలాలు ఉన్నప్పటికీ వీటిపై వాహనదారులకు అవగాహన లేక వాటిని వాడుకోవడం లేదు. బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు, కమర్షియల్ సంస్థలు ఇష్టానుసారంగా రోడ్ల వెంట ఉండే స్థలాలను పార్కింగ్ కోసం ఆక్రమించుకుంటున్నాయి. జీహెచ్ంఎసీ పర్మిషన్ ఇచ్చిన పార్కింగ్ స్థలాలు సిటీలో కేవలం 53 మాత్రమే ఉన్నాయి.
పార్కింగ్ లేక ఇబ్బంది
బేగంబజార్‌లోని మార్కెట్‌కు వచ్చే వారు వెహికల్స్ పార్కింగ్ కోసం ఇబ్బంది పడుతున్నారు. కొందరు రోడ్లపైనే వెహికల్స్ పెట్టడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇలాంటి చోట జీహెచ్ఎంసీ పార్కింగ్కాంప్లెక్స్ నిర్మిస్తే బాగుంటుంది.
- విశ్వనాథ్, వ్యాపారి, బేగంబజార్