దళితబంధులో 70 శాతం యూనిట్లు పక్కదారి..లబ్ధిదారుల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ లీడర్లే

దళితబంధులో 70 శాతం యూనిట్లు పక్కదారి..లబ్ధిదారుల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ లీడర్లే
  •     యూనిట్లు అమ్మేసుకున్నట్లు సర్కార్ విచారణతో వెలుగులోకి
  •     ఫేజ్ 1, 2 కింద రూ.3,884 కోట్లు ఖర్చు చేసిన గత బీఆర్ఎస్ సర్కారు
  •     38,706 మందికి యూనిట్ల పంపిణీ

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన దళిత బంధు యూనిట్లలో 70 శాతం పక్కదారి పట్టినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. నిరుపేద దళితులకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా చేయూత అందించాల్సి ఉండగా ఎక్కువ మంది బీఆర్ఎస్ లీడర్లనే లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. ఈ స్కీం కింద పంపిణీ చేసిన యూనిట్లు లబ్ధిదారుల వద్ద లేవని విచారణలో తేలింది. ఎక్కువ మంది అనర్హులు ఉండటంతో వాళ్లంతా యూనిట్లను అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు స్పష్టమైంది. వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టడంతో అనర్హుల నుంచి వాటిని రికవరీ చేసి అర్హులకు ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది.

హుజురాబాద్​కే సగం యూనిట్లు

దళితబంధు స్కీంలో హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ సెగ్మెంట్​గా ప్రకటిస్తున్నట్లుగా ఆ నాటి కేసీఆర్​ ప్రభుత్వం పేర్కొన్నది. వాస్తవంగా ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీం ప్రారంభించినట్లుగా నాడు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. మేధావులు, ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నా నాటి కేసీఆర్ పట్టించుకోలేదు. దళితబంధును మొదట హుజూరాబాద్ నుంచే మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ, విపక్షాలు, రాజకీయ విశ్లేషకుల విమర్శల వల్ల దీన్ని కేసీఆర్ తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. కానీ, అసలైన దళిత బంధు పథకం హుజూరాబాద్ లోనే మొదలైంది.
ఒక్క హుజురాబాద్​లోనే 18వేల మంది
దళిత బంధు స్కీం కింద రాష్ట్ర వ్యాప్తంగా 38,706 మంది లబ్ధి పొందితే అందులో హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గంలోనే 18,021 మంది ఉన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఉప ఎన్నికకు ముందు లబ్ధిదారుల్లో 9,873 మందికి పూర్తిగా రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందగా మిగిలిన వారికి ఎంచుకున్న యూనిట్లను బట్టి 50 నుంచి 80 ఆ పై శాతం ఆర్థిక సాయాన్ని అందించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్​కం ట్యాక్స్ చెల్లించేవారి పేర్లు కూడా ఉన్నాయి.
బీఆర్ఎస్ లీడర్లే ఎక్కువ
దళితబంధు ఫేజ్ 1 కింద హుజురాబాద్ మినహా మిగిలిన 118 సెగ్మెంట్​లలో ఒక్కో నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున 11,800 మందికి యూనిట్లు అందించారు. ఆ తర్వాత కూడా మరో 8,885 మందికి యూనిట్లు పంపిణీ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అంతా అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలే చేపట్టారు. మున్సిపాలిటీలు, మండలం, గ్రామాల్లో తమతో తిరిగే బీఆర్ఎస్ లీడర్లనే ఈ స్కీం కింద ఎంపిక చేశారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందించారు. ఈ స్కీంలో ఒక్క రూపాయి కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించేది లేకపోవడంతో గవర్నమెంట్​ ఆఫీసర్లు, బడా లీడర్లు అంతా పోటీపడ్డారు. లిస్ట్​లో చాలా మంది ప్రజా ప్రతినిధులు, మాజీ నేతలు, మండల, జిల్లా స్థాయి లీడర్లు ఉన్నారు. బీఆర్ఎస్ లీడర్లంతా తమ యూనిట్ల కింద ఎక్కువగా కార్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, హార్వెస్టర్లు తీసుకున్నారు. అక్కడక్కడ షాపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నల్ ఎంక్వయిరీ..
దళిత బంధు యూనిట్లు పొందిన బీఆర్ఎస్ లీడర్లు అందరు ఈ యూనిట్లను తమకు నచ్చిన రేట్లకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లుగా ప్రభుత్వ విచారణలో తేలింది. ముఖ్యంగా కార్లు, ట్రాక్టర్లు తదితర వెహికల్స్ అన్నీ అమ్ముడుపోయినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ‘‘ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో 3,462 మందికి దళితబంధు యూనిట్లు ఇస్తే.. అందులో 1,387 యూనిట్లు పక్కదారి పట్టాయి. చాలా మంది వీటిని అమ్ముకున్నారు”అని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దళితబంధు యూనిట్లను అమ్మడం, కొనడం చట్ట వ్యతిరేకమని.. వీటిని రికవరీ చేసి అర్హులైన వారికి అందజేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం దళిత బంధు యూనిట్లపై రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత విచారణ జరిపారు. చట్టప్రకారం దళితబంధు యూనిట్లు పొందిన వాళ్లు ఎవరు? వాటిని వాళ్లే ఉపయోగించి లబ్ధి పొందుతున్నారా? లేక అమ్మేసుకున్నారా? లీజ్​కు ఇచ్చిన వాళ్లెందరు? అనే విషయంలో ఎంక్వైరీ చేయగా 70 శాతం యూనిట్లు పక్కదారి పట్టినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

38,706 మందికి రూ.3,860 కోట్లు
హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో 2021లో దళితబంధు స్కీమ్​ను అప్పటి కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 17 లక్షల దళిత కుటుంబాలకు రూ.1.70 లక్షల కోట్లు కేటాయిస్తామని ఆ నాడు కేసీఆర్ ప్రకటించారు. మూడేండ్ల కాలంలో అందరికి దళితబంధు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే 2021, ఆగస్టు 5న యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ.7.60 కోట్ల నిధులను విడుదల చేసి ఈ పథకం ప్రారంభించారు. ఫేజ్–1లో 38,232 మందికి రూ.3,860.95 కోట్లు కేటాయించిన అప్పటి సర్కారు.. ఫేజ్–2 కింద 1.30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. అందులో కేవలం 474 మందికి మాత్రమే అందించారు. మొత్తంగా ఈ స్కీంలో 38,706 మందికి రూ.3,884 కోట్లు ఖర్చు చేశారు.