
న్యూఢిల్లీ: ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభణ ఎక్కువవుతోంది. కొన్నాళ్లు తక్కువగా నమోదైన కరోనా పాజిటివ్‌ల సంఖ్య గత కొద్ది రోజులుగా తీవ్రమవుతోంది. కేసులు పెరిగిపోతుండటంతో ఫ్రాన్స్, జర్మనీలు మళ్లీ లాక్‌డౌన్ విధించాయి. శుక్రవారం నుంచి లాక్‌డౌన్ విధిస్తున్నామని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రకటించారు. డిసెంబర్ 1 దాకా ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. నెల రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ఫ్రాన్స్‌లో ఎక్కడ చూసిన ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి. గురువారం రాత్రి పారిస్‌లో ప్రజలంతా సిటీని విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జనాలంతా వెహికిల్స్‌తో ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో వందల కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపుగా 700 కిలో మీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఫ్రాన్స్‌లో రోజుకు 50 వేల కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్ తిరిగి లాక్‌డౌన్ వేయాలని నిర్ణయించారు.