‘సెస్’ బరిలో 75 మంది నామినేషన్లు

‘సెస్’ బరిలో 75 మంది నామినేషన్లు
  • ‘సెస్’ బరిలో 75 మంది నామినేషన్లు 
  • ఉప సంహరణ పూర్తి
  • నేటి నుంచి ప్రచారం షురూ 

రాజన్నసిరిసిల్ల,వెలుగు:  సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల బరిలో 75 మంది అభ్యర్థులు నిలిచారు. శనివారం నామినేషన్ల ఉససంహరణ ముగిసింది. 130 మంది అభ్యర్థులకు 149 నామినేషన్లు దాఖలు కాగా 55 మంది ఉపసంహరించుకున్నారు. సెస్​ఎన్నికల్లో 75 మంది పోటీలో  ఉన్నారని, వారికి గుర్తులు కేటాయించినట్లు సెస్ ఎన్నికల అధికారి మమత తెలిపారు. నేటి నుంచి ప్రచారం ప్రారంభం కానుంది. కాగా ప్రజల్లో పరపతి ఉన్న పలువురు స్వత్రంత్ర అభ్యర్థులను బీఆర్​ఎస్ ముఖ్య లీడర్లు బుజ్జగించారు. భవిష్యత్​లో పార్టీ మంచి అవకాశం కల్పిస్తామని చెప్పి నామినేషన్లను ఉపసంహరింపజేశారు. 

రంగంలోకి మినిస్టర్..

సెస్ ఎన్నికల నేపథ్యంలో మినిస్టర్​ కేటీఆర్​స్వయంగా రంగంలోకి దిగి ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులను ఫోన్ లో బుజ్జిగించినట్లు సమాచారం. ఓటు బ్యాంక్ ఉన్న స్వతంత్ర అభ్యర్థులను విత్ డ్రా చేసుకునేందుకు కేటీఆర్ మేనబావ చీటి నర్సింగరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, టెక్స్​టైల్ పవర్​లూం కార్పొరేషన్ చైర్మన్ గుడూరి ప్రవీణ్ మంతనాలు జరిపి మంత్రితో ఫోన్ మాట్లాడించారు. తంగళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన చిక్కాల రామారావుకు వ్యతిరేకంగా నిలబడిన దడిగెల శ్రావణ్​రావును బుజ్జగింజి సెస్ బరి నుంచి తప్పించారు. జిల్లాలో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు ఎవరూ లేకుండా చేయడంలో మినిస్టర్​సఫలీకృతులయ్యారు. సిరిసిల్లలో బలమైన సామాజికవర్గానికి చెందిన ఓ నేత, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓ లీడర్​కూడా మంత్రి కేటీఆర్ కోసమే తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు మీడియాకు తెలిపారు.

బీఆర్ఎస్ నుంచి ఇద్దరి సస్పెన్షన్..

పార్టీ ఆదేశాలను ఉల్లంఘించారని పార్టీ నుంచి ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్ సర్పంచ్ భర్త కొక్కు దేవేందర్ యాదవ్, వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండాకు చెందిన భూక్య సంతోష్ నాయక్ సెస్ బరిలో నిలిచారు. దీంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్​చేశారు.

బీజేపీ స్పెషల్ ఫోకస్..

సెస్ పరిధిలోని 15 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులను బరిలో నిలిపింది. గెలుపే లక్ష్యంగా పని చేసేందుకు మరో రెండు రోజుల్లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సిరిసిల్లలో మకాం వేస్తారని బీజేపీ లీడర్లు తెలిపారు. కాగా అభ్యర్థుల గుర్తుల కేటాయింపుల్లో సెస్ అధికారులు వివక్ష చూపారని బీజేపీ లీడర్లు శనివారం సెస్ ఆఫీస్​ముందు ధర్నా చేశారు. అధికార పార్టీకి మధ్యాహ్నమే గుర్తులు కేటాయించారని, ప్రతి పక్ష లీడర్లకు రాత్రి తొమ్మిదింటి వరకు గుర్తులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.