75% ల్యాబ్​లు రూల్స్ పాటించట్లే

75% ల్యాబ్​లు రూల్స్ పాటించట్లే
  • రీసెర్చ్​ ల్యాబ్​లలో సేఫ్టీ అంతంతే!
  • గ్లోబల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ సెక్యూరిటీ ఇండెక్స్‌‌‌‌ వెల్లడి
  • బయో రిస్క్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ లేదని స్పష్టం

లండన్‌‌‌‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ల్యాబ్​ నుంచే లీకయిందనే ప్రచారం సంగతెలా ఉన్నా.. భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన వైరస్​లు దాడి చేసే ప్రమాదం ఉందని గ్లోబల్​ హెల్త్​ సెక్యూరిటీ ఇండెక్స్ హెచ్చరిస్తోంది. వివిధ దేశాలలోని ల్యాబ్​లు చాలా వాటిలో సేఫ్టీ రూల్స్ అమలు అంతంత మాత్రమేనని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో భయంకరమైన వ్యాధికారక వైరస్‌‌‌‌లు, బ్యాక్టీరియాలపై చేస్తున్న రీసెర్చ్‌‌‌‌ వల్ల మున్ముందు మరిన్ని మహమ్మారులు రావొచ్చని తెలిపింది. ప్రపంచంలోని ఇలాంటి డేంజరస్‌‌‌‌ వ్యాధికారకాలపై 59 బీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌4 ల్యాబ్‌‌‌‌లు(పనిచేస్తున్నవి, నిర్మాణం నడుస్తున్నవి) రీసెర్చ్‌‌‌‌ చేస్తుండగా వీటిల్లో కేవలం 25% ల్యాబ్‌‌‌‌లలోనే సేఫ్టీ రూల్స్​ను కచ్చితంగా పాటిస్తున్నారు. 75% బీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌4 ల్యాబ్‌‌‌‌లలో బయో రిస్క్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సరిగా లేదని తేలింది. ఇంటర్నేషనల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బయోసేఫ్టీ అండ్‌‌‌‌ బయో సెక్యూరిటీ రెగ్యులేటర్స్‌‌‌‌లో సభ్యత్వం ఉన్న దేశాలు తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో సభ్య దేశాలకు వివరిస్తుంటాయి. ఇందులో బీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌4 ల్యాబ్‌‌‌‌లు ఉన్న దేశాలు 40 శాతమే సభ్యత్వం తీసుకున్నాయి. కొన్ని ల్యాబ్‌‌‌‌లలో ప్రజలకు అవసరమైన ప్రయోగాలతో పాటు హాని చేసే అవకాశం లేకపోలేదు. ఇలాంటి రెండు రకాల ప్రయోగాలపై నియంత్రణకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో జాతీయ పాలసీలున్నాయి. మరో 23 దేశాల్లో ఇలాంటి పాలసీలేం లేవు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో బీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌4 ల్యాబ్‌‌‌‌ల ఏర్పాటుకు అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రయోగాలతో ఉపయోగాలు ఉన్నట్లే, రిస్క్‌‌‌‌ కూడా ఉంటుందని తెలుసుకోవాలని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్నారు.

ఎక్కడెక్కడ ఎన్నున్నాయి?
హైరిస్క్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌లను లెవల్‌‌‌‌ 4 ల్యాబ్‌‌‌‌లు అంటారు. వీటిల్లో ప్రత్యేక సూట్‌‌‌‌లు వేసుకొని సైంటిస్టులు ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి ల్యాబ్‌‌‌‌లు యూరప్‌‌‌‌లో 25 ఉన్నాయి. ఉత్తర అమెరికాలో 14, ఆసియాలో 13, ఆస్ట్రేలియాలో 4, ఆఫ్రికాలో 3 ఉన్నాయి. వీటిల్లో 75 శాతం వరకు ల్యాబ్‌‌‌‌లు పట్టణాలు, నగరాల్లోనే ఉన్నాయి. వుహాన్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌ ప్రపంచంలోనే అతి పెద్దది. దీన్ని త్వరలో అమెరికాలో నిర్మిస్తున్న నేషనల్‌‌‌‌ బయో, ఆగ్రో డిఫెన్స్‌‌‌‌ ఫెసిలిటీ అధిగమించబోతోంది. ఇక చాలా వరకు ల్యాబ్‌‌‌‌లు చాలా చిన్నవి. 44 ల్యాబ్‌‌‌‌లు ప్రొఫెషనల్‌‌‌‌ బాస్కెట్‌‌‌‌ బాల్‌‌‌‌ కోర్టు సైజులో సగం కూడా లేవు. వీటిల్లో 60 శాతం ల్యాబ్‌‌‌‌లను ప్రభుత్వం, 20 శాతం యూనివర్సిటీలు, మరో 20 శతం బయో డిఫెన్స్‌‌‌‌ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. కొత్త డ్రగ్స్‌‌‌‌ను తయారు చేయడానికి, వ్యాధులకు వ్యాక్సిన్లు కనుగొనడానికి వీటిల్లో పరిశోధనలు చేస్తుంటారు.