అత్యుత్తమ విద్యా కేంద్రాల్లో వివక్ష జాడ్యం

అత్యుత్తమ విద్యా కేంద్రాల్లో వివక్ష జాడ్యం

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా సామాజిక అసమానతలు పూర్తి స్థాయిలో తొలగిపోలేదు. కుల, వర్గ వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా ఉన్న ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, ఐఐఎస్సీలు, ఐఐఎస్ఈఆర్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనూ వివక్ష జాడ్యం కొనసాగటం దుర్మార్గం. ఓబీసీల వెనుకబాటుతనం విద్యా, ఉద్యోగాల్లో అడ్డుకాకూడదని కేంద్రం ఓబీసీ రిజర్వేషన్లు తెచ్చింది.

అగ్రవర్ణ పేదలకు కూడా విద్య, ఉద్యోగాల్లో(ఈడబ్ల్యూఎస్​) రిజర్వేషన్లు కల్పించింది. ఎస్సీ, ఎస్టీలకు ముందు నుంచే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. సామాజిక, ఆర్థిక, వర్గపరమైన అసమానతలను రూపుమాపేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే.. ఆయా సెంట్రల్​వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల వీసీలు, డైరెక్టర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రవేశాలు, నియామకాల్లో వివక్ష చూపుతూ కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నీరుగారుస్తున్నారు. ఫలితంగా అన్ని అర్హతలు ఉన్నా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు, అభ్యర్థులు అన్యాయానికి గురికావాల్సి వస్తోంది. 
పీహెచ్​డీ ప్రవేశాల్లో అన్యాయం..
దేశంలోని సెంట్రల్​యూనివర్సిటీలు సహా ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్​డీ ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో తెలియాలంటే ఇటీవల లోక్ సభలో విద్యాశాఖ మంత్రి తెలిపిన వివరాలను గమనించాలి. వాటి ప్రకారం..  జనరల్ ​కేటగిరీల విద్యార్థులకు దరఖాస్తు చేసుకున్న శాతం కంటే ఎక్కువ శాతం పీహెచ్​డీ సీట్లు దొరుకుతుండగా, మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు నష్టం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కావాలనే ఆయా వర్సిటీల వీసీలు, డైరెక్టర్లు అన్ని అర్హతలు ఉన్నా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను అర్హులుగా గుర్తించడం లేదని స్పష్టమవుతోంది. 2021–2022 అకడమిక్​ పీహెచ్​డీ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న వర్గాలు.. వారికి దక్కిన సీట్లను పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయి.

ఐఐటీ ఢిల్లీలో 8 డిపార్ట్​మెంట్లలో 637 అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు పీహెచ్​డీ కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారిలో ఒక్కరికి కూడా సీటు రాలేదు. మొత్తం 53 సీట్లు ఉంటే అన్ని జనరల్ కేటగిరీకే ఇచ్చేశారు. ఐఐటీ ఖరగ్ పూర్​లో జనరల్​ కేటగిరీ వాళ్లవి 11.9 శాతం అప్లికేషన్లు ఆమోదిస్తే, ఎస్టీలవి 3.2 శాతమే ఓకే చేశారు. ఐఐటీ ఢిల్లీలో జనరల్​కేటగిరీ అప్లికేషన్లు 52.7 శాతం వస్తే.. వారికి దక్కిన పీహెచ్​డీ సీట్ల శాతం70.5. ఐఐటీ ఇండోర్​లో జనరల్ కేటగిరీ నుంచి 41.2% దరఖాస్తులు వస్తే అందులో 63.8% స్టూడెంట్స్​కు ప్రవేశాలు దక్కాయి. ఎస్సీ విద్యార్థులవి 12 శాతం దరఖాస్తులు వస్తే.. 5.5% మందికే సీట్లు కేటాయించారు. ఐఐటీ భిలాయిలో10.9% ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు రాగా, అందులో ఒక్కరికి కూడా సీటు దక్కలేదు.

వందల సంఖ్యలో ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు వచ్చినా ఐఐటీ తిరుపతి, ఐఐటీ మండి, ఐఐటీ గోవా, ఐఐటీ భిలాయ్ ఒక్క ఎస్టీ విద్యార్థిని కూడా పీహెచ్​డీలో చేర్చుకోలేదు. ఐఐటీ ఖరగపూర్, ఐఐటీ ఇండోర్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ తిరుపతి, ఐఐటీ మండి, ఐఐటీ భువనేశ్వర్ లలో జనరల్ కేటగిరీలో వచ్చిన దరఖాస్తుల శాతం కంటే వారికి కేటాయించిన సీట్ల శాతం అధికంగా ఉండటం గమనార్హం. ఐఐటీ ఢిల్లీ డిపార్ట్​మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్​డీ కోసం 34 మంది ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా ప్రవేశం కల్పించలేదు. బయో కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్ డిపార్ట్​మెంట్లలో104 మంది ఎస్సీలు, 171 బీసీలు దరఖాస్తు చేసుకుంటే ఏ ఒక్కరికీ అడ్మిషన్​ దొరకలేదు.

ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ తిరుపతిలో డిపార్ట్​మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఒక్క ఎస్టీ విద్యార్థికి అవకాశం రాలేదు. ఇలా చాలా ఉన్నత విద్యా సంస్థల్లో జనరల్​ కేటగిరీల వారికి దక్కుతున్న సీట్లకు, మిగతా వారికి పొంతన ఉండటం లేదు. కొందరు అగ్రవర్ణాలకు చెందిన వీసీలు, డైరెక్టర్లు, ప్రొఫెసర్లు కావాలనే జనరల్​కేటగిరీల వారికి ఎక్కువ అడ్మిషన్లు కల్పిస్తూ, మిగతా వారిని రిజెక్ట్​చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రొఫెసర్ల నియామకాల్లోనూ..
ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉన్నత విద్యాసంస్థల్లో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న 9 వేల ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో గత రెండేండ్ల నుంచి నోటిఫికేషన్లు ఇస్తూ.. చేపడుతున్న నియామకాల్లోనూ వివక్ష కనిపిస్తోంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అన్యాయం జరుగుతోంది. రిజర్వేషన్, రోస్టర్​పాయింట్స్ తారుమారు చేస్తున్నారు.

ఐఐటీలు, ఎన్ఐటీలు ఫ్లెక్సిబుల్ క్యాడర్ పేరుతో రోస్టర్లు లేకుండా నోటిఫికేషన్ ఇస్తున్నాయి. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ పెట్టిన ఆర్టీఐ దరఖాస్తుతో చాలా విషయాలు బయటకు వచ్చాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్​లో దేశంలోనే అత్యధికంగా 66 మంది ఎస్టీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ వచ్చాయి కానీ నన్ ఫౌండ్ సూటబుల్(ఎన్ఎఫ్ఎస్​) అని చెప్పి ఏ ఒక్క ఎస్టీ అభ్యర్థిని నియమించుకోలేదు. 75 ఎస్సీ దరఖాస్తుల్లో కూడా ఎన్ఎఫ్ఎస్ అనే ఆప్షన్ వాడి ఎవరిని నియమించుకోలేదు.

అభ్యర్థులకు సరైన సామర్థ్యాలు ఉన్నా ఎన్ఎఫ్ఎస్ ఆప్షన్ వాడటంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఐఐటీ హైదరాబాద్ మిషన్ మోడ్ రిక్రూట్​మెంట్ కింద భర్తీ చేయాల్సిన 53 ఓబీసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల్లో 7 మాత్రమే, 30 ఎస్సీ ఉద్యోగాల్లో 5,  అలాగే 15 ఎస్టీ ఉద్యోగాల్లో సున్న, 20 ఈడబ్ల్యూఎస్ ఉద్యోగాలకు కేవలం ఒకరిని మాత్రమే నియమించింది. 

ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి
తెలంగాణలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇఫ్లూలో ఓబీసీలకు అన్యాయం జరిగినట్లు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్(ఎన్సీబీసీ) జరిపిన విచారణలో బయట పడింది. ఓబీసీ రోస్టర్ పాయింట్ల విషయంలో అన్యాయం జరిగినట్లుగా గుర్తించి, వాటిని సరిచేయాలని ఫిబ్రవరిలో వర్సిటీ అధికారులను ఆదేశించింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. రోస్టర్​ పాయింట్లు పాటించకుండా, అన్ని అర్హతలు ఉన్నా.. అర్హతలు లేవని అభ్యర్థులను తిరస్కరిస్తున్న వీసీలపై, డైరెక్టర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ఇప్పటి వరకు జరిగిన నియామకాలు, పీహెచ్​డీ అడ్మిషన్ల ప్రక్రియపై సమీక్ష నిర్వహించి నిజానిజాలు నిగ్గుతేల్చాలి. అన్యాయానికి గురైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల సామర్థ్యాల మేరకు పీహెచ్​డీ అడ్మిషన్లు ఇవ్వాలి, ప్రొఫెసర్, అసోసియేట్​ ప్రొఫెసర్, అసిస్టెంట్​ప్రొఫెసర్​ సహా వీసీ, డైరెక్టర్​ పోస్టులు వారికి కేటాయించాలి.  -  జి. కిరణ్​కుమార్, అధ్యక్షుడు, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్​ అసోసియేషన్