ఫిలిప్పీన్స్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికతో వణికిపోతున్న ప్రజలు

ఫిలిప్పీన్స్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికతో వణికిపోతున్న ప్రజలు

ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని ఆ దేశ భూకంప శాస్త్ర సంస్థ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

ఈ భూకంపం మిండనావోలోని దావో ఓరియంటల్‌లోని మనయ్ పట్టణంలో 10 కి.మీ లోతులో సముద్ర జలాలను తాకినట్లు ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సెస్మాలజీ (ఫివోల్క్స్) పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యగా మధ్య ఫిలిప్పీన్స్‌, దక్షిణ ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ నష్టం జరిగినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని ఫిలిప్పీన్స్‌ అధికార యంత్రాంగం వెల్లడించింది.

భూకంప కేంద్రం నుంచి 186 మైళ్ల పరిధిలో ప్రమాదకరమైన అలలు సంభవించే అవకాశం ఉందని హవాయిలోని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం చెప్పింది. ఫిలిప్పీన్స్ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసి పడే అవకాశం ఉందని, ఇండోనేషియాలో తీర ప్రాంతాలపై కూడా ఈ భూకంప ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ భూకంపం కారణంగా దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలో కొన్ని భవనాలు నేలమట్టం అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భూకంపం సంభవించగానే ప్రజలు భయంతో వణికిపోయారు. ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టాగమ్ సిటీ దావో ఆసుపత్రి నుంచి రోగులు, ఆసుపత్రి సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డు మీదకు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి, పాపువా ప్రాంతాలకు సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆ దేశ తీర ప్రాంతాలను 50 సెంటీమీటర్ల ఎత్తులో అలలు తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

ఫిలిప్పీన్స్ దశాబ్ద కాలంలోనే అత్యంత దారుణమైన భూకంపాన్ని చవిచూసిన రెండు వారాలకే శుక్రవారం మరో భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఫిలిప్పీన్స్లోని సెబులో సెప్టెంబర్ 30న భారీ భూకంపం సంభవించి 72 మంది మృతి చెందారు. వందల మంది గాయపడ్డారు. ఇప్పుడిప్పుడే ఆ భయానక పరిస్థితుల నుంచి బయటపడుతున్న ఫిలిప్పీన్స్ ప్రజలను మరోసారి భూకంపం భయభ్రాంతులకు గురిచేసింది.