కాసేపట్లో అంత్యక్రియలనగా లేచి కూర్చున్న 76 ఏళ్ల బామ్మ

కాసేపట్లో అంత్యక్రియలనగా లేచి కూర్చున్న 76 ఏళ్ల బామ్మ

ఆవిడో 76 ఏళ్ల బామ్మ.. కరోనాతో చనిపోయింది. బంధువులందరూ వచ్చారు.. పాడె కట్టి శ్మశానానికి తీసుకెళ్లారు. ఇక కాసేపట్లో అంత్యక్రియలు. అంతలోనే బామ్మ సడెన్‌గా లేచి కూర్చుంది. ఈ వింత ఘటన మహారాష్ట్రలోని బారామతిలో జరిగింది.

బారామతిలోని ముధలే గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్(76) కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడింది. దాంతో ఆమెను కుటుంబసభ్యులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచారు. కాగా.. వయసురిత్యా ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు.. బామ్మను మే 10న బారామతిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో బెడ్‌లు లేకపోవడంతో బామ్మను వాహనంలోనే ఉంచారు. అలా కాసేపటి తర్వాత బామ్మ అపస్మారకస్థితిలోకి చేరి అచేతనంగా మారింది. దాంతో బామ్మ చనిపోయిందని కుటుంబసభ్యులు భావించారు. తమ బంధువులకు సమాచారమిచ్చి దహనసంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఈలోగా ఉన్నట్టుండి బామ్మ పాడె మీద నుంచి లేచి కూర్చుంది. అది చూసిన కుటుంబసభ్యులు, బంధువులు ముందు భయానికి ఆ తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యారు. వెంటనే బామ్మను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. బామ్మను పరిశీలించిన వైద్యులు.. ఆమె చనిపోలేదని.. అన్‌కాన్షియస్ అయిందని తెలిపారు. బామ్మను ఆస్పత్రిలో చేర్చుకొని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బామ్మను బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రికి తరలించారు.