చెరువులు లెక్కిస్తున్నరు.. ప్రతి చెరువుకూ ఓ నెంబర్.. జియో ట్యాగింగ్

 చెరువులు లెక్కిస్తున్నరు.. ప్రతి చెరువుకూ ఓ నెంబర్.. జియో ట్యాగింగ్
  • ఐదేండ్లకో సారి మైనర్ ఇరిగేషన్ సర్వే 
  •  7వ సర్వే లో పైలట్‌‌గా యాదాద్రి 
  • ముగింపు దశకు చెరువుల లెక్క 

యాదాద్రి, వెలుగు:  చెరువులు, బావులు, బోర్లు, లిఫ్ట్​ లెక్కలు తేలనున్నాయి. లెక్కలు తేల్చడంతో పాటు యాప్​లో నమోదు చేసి జియో ట్యాగింగ్​ చేయనున్నారు. గుర్తించిన ప్రతి చెరువుకూ ఒక నెంబర్​ను కేటాయించనున్నారు. నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వనరులకు ప్రత్యేకంగా ఓ కోడ్​ నెంబర్​ కేటాయిస్తారు. ఫైలట్​ప్రాజెక్టుగా ఎంపికైన యాదాద్రి జిల్లాలో ఇప్పటికే చెరువుల లెక్కింపు చివరి దశకు చేరుకుంది.

ఐదేండ్లకు ఒకసారి

చిన్న నీటి వనరులను దేశ వ్యాప్తంగా రెవెన్యూ గ్రామాల్లో ప్రతి ఐదేండ్లకు ఒకసారి లెక్కిస్తారు. 1986-– 87లో ప్రారంభమైన ఈ సర్వే.. 2017-–18 ఫైనాన్స్​ఇయర్​ను బేస్​ చేసుకొని 2019లో ఆరోసారి నిర్వహించారు. ఆయకట్టు కలిగిన చెరువులతో పాటు వ్యవసాయ బోర్లు, బావులు,  లిఫ్ట్​ లను లెక్కిస్తారు.  ఫైలట్​గా యాదాద్రి.. చెరువుల సర్వే షురూచిన్న నీటి వనరుల సర్వేకు రాష్ట్రంలో యాదాద్రి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు.

దీంతో ఇప్పటికే ట్రైనింగ్ తీసుకున్న ఎంపీఎస్వో జిల్లాలోని 321 రెవెన్యూ గ్రామాల్లో చెరువులకు సంబంధించిన సర్వే నిర్వహించి యాప్​లో నమోదు చేయడంతో పాటు జియో ట్యాగింగ్​ పూర్తి చేశారు. ఇబ్బందులను ఇప్పటికే హయ్యర్​ ఆఫీసర్లుకు 
రిపోర్ట్​ చేశారు. 

అక్టోబర్‌‌‌‌‌‌లో బోర్లు, బావులు 

అక్టోబర్​ నుంచి బోర్లు, బావులు, లిఫ్ట్​ల లెక్కింపు చేయాల్సి ఉంటుంది.  ఈ సర్వే కోసం ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక్కో ఎన్యూమరేటర్​ను ఎంపిక చేయాల్సి ఉంది. 
ఎన్యూమరేటర్లుగా అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్​నుంచి ఏఈవో, పంచాయతీ నుంచి జీపీవో, డీఆర్​డీఏ నుంచి టెక్నికల్​ అసిస్టెంట్‌‌ను ఎంపిక చేయనున్నారు. సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లకు ట్రాన్స్​పోర్ట్, సెల్​ఫోన్​ నిర్వహణ కోసం ప్రతి నెల రూ.1900 ఇవ్వనున్నారు. 

సర్వేలో నమోదు చేయాల్సిన అంశాలు ఇవే

చిన్న నీటి వనరుల సర్వే అన్ని అంశాలను నమోదు చేయాలి.  చెరువు, బోర్లు, బావుల తవ్వకం ఎప్పుడు జరిగింది. వాటి ఓనర్​ ఎవరూ కూడా చేర్చాలి. అవి ఉన్న సర్వే నెంబర్​, బై నెంబర్లు, ఖాళీ ప్లాట్లలో ఉంటే రిజిస్ట్రేషన్​ నెంబర్​ పేర్కొనాల్సి ఉంటుంది. 

నక్సల్​ ప్రాంతాల్లోని ప్రత్యేక కోడ్

ప్రతీ గ్రామంలోని నీటి వనరులకు 001 నుంచి కోడ్​ నెంబర్​ కేటాయించాలి. చెరువుకు స్థానికంగా ఇచ్చిన నెంబర్​కు మరో 18 అంకెలు కలిపి అంటే గ్రామం, వార్డు, పట్టణం, బ్లాక్, జిల్లా, రాష్ట్రం వీటికి కేటాయించిన నెంబర్లతో కలిపి 21 అంకెలు గల ప్రత్యేక నెంబర్‌‌‌‌ను కేటాయిస్తారు.కరువు పీడిత ప్రాంతాల్లోని నీటి వనరులకు కోడ్​-1 గా  గిరిజనులకు సంబంధించిన ప్రాంతానికి కోడ్​-2, ఎడారి ప్రాంతమైతే  కోడ్​-3, వరద ప్రభావిత ప్రాంతంలోని వనరులకు కోడ్​-4 గా పేర్కొంటారు. నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లోని నీటి వనరులకు కోడ్​-5 గా సూచిస్తారు.    మిగిలిన అన్ని ప్రాంతాలను కోడ్​ -9 గా గుర్తించాలన్నారు.  

సర్వే జరుగుతోంది 

ఏడో చిన్న నీటి వనరుల సర్వే కోసం యాదాద్రి జిల్లాను పైలట్‌‌గా ఎంపిక చేశారు. చెరువులకు సంబంధించి సర్వే చివరి దశకు చేరింది. బోర్లు, బావులు, లిఫ్ట్‌‌ లకు సంబంధించిన సర్వే అక్టోబర్​లో నిర్వహిస్తాం.  ఎన్యూమరేటర్ల ఎంపిక త్వరలో పూర్తి చేస్తాం.  - వెంకట రమణ, సీపీవో, యాదాద్రి 

2013-14లో 320 గ్రామాల్లో జరిగిన చిన్న నీటి వనరుల ఐదో సర్వే వివరాలు

బోర్లు    చెరువులు    లిఫ్ట్​    మొత్తం
59,440    936    1604    62,330

2017-18లో 316 గ్రామాల్లో జరిగిన చిన్న నీటి వనరుల ఆరో సర్వే వివరాలు

బోర్లు    చెరువులు    లిఫ్ట్​    మొత్తం
58,650    1323    1968    61,971