యూనివర్సిటీలో స్టూడెంట్ కాల్పులు.. 8 మంది మృతి

యూనివర్సిటీలో స్టూడెంట్ కాల్పులు.. 8 మంది మృతి

రష్యాలోని ఓ యూనివర్సిటీలోకి గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం పెర్మ్‌ కరై రీజియన్‌లోని పెర్మ్‌ స్టేట్ యూనివర్సిటీలో జరిగింది. ఈ ఘటనలో కాల్పుల నుంచి తప్పించుకునేందుకు కొందరు స్టూడెంట్స్ బిల్డింగ్‌పై నుంచి దూకి గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఓ దుండగుడు హెల్మెట్‌ పెట్టుకుని తుపాకీతో పెర్మ్ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ఎంటరయ్యాడు. లోపలికి వెళ్లగానే ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. దీంతో అతడి నుంచి తప్పించుకునేందుకు కొంత మంది స్టూడెంట్లు యూనివర్సిటీ ఆడిటోరియంలో దాక్కున్నారు. మరికొంత మంది విద్యార్థులు కిటికీలు ఓపెన్‌ చేసుకుని బిల్డింగ్ పై నుంచి దూకేశారు. ఈ దాడి విషయం సమాచారం అందడంతో రష్యా  పోలీసులు స్పాట్‌కు చేరుకుని ఆ దుండగుడిని మట్టుబెట్టారని రష్యా న్యూస్ ఏజెన్సీ  వెల్లడించింది. అయితే ఈ కాల్పులకు పాల్పడింది ఆ యూనివర్సిటీలో చదువుతున్న 18 ఏండ్ల స్టూడెంటేనని పోలీసులు తేల్చినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. కాగా, ఆరుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో బుల్లెట్ గాయాలైన వాళ్లతో పాటు, తప్పించుకునేందుకు బిల్డింగ్‌పై నుంచి దూకిన వాళ్లు కూడా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.