సిగమూగిన కొమురెల్లి .. పట్నం వారం పోటెత్తిన భక్తులు

సిగమూగిన కొమురెల్లి ..  పట్నం వారం పోటెత్తిన భక్తులు

సిద్దిపేట, వెలుగు: కొమురెల్లి మల్లన్న మహా జాతరలో మొదటి పట్నం వారం భక్తులు పోటెత్తారు. మల్లన్న నామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. మల్లికార్జున స్వామి కొలువైన విజయాచల గుట్టలు డప్పు చప్పుళ్లు, శివసత్తుల సిగాలు, పోతురాజుల విన్యాసాలతో ప్రతి ధ్వనించాయి. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా మల్లన్న భక్తులు భావిస్తారు. దీంతో ఆదివారం దాదాపు లక్ష మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే వారు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుంటారు. దీంతో గతేడాది కంటే ఈసారి ఎక్కువగా భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనానికి క్యూకట్టారు. 

ఉచిత దర్శనానికి10 గంటలు, శ్రీఘ్ర దర్శనానికి ఐదు గంటలు, వీఐపీ దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. కొమురవెల్లి నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఇసుకేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయి కనిపించారు. మల్లన్న ను దర్శించుకున్న తర్వాత భక్తులు సమీప గుట్టపై మల్లన్న సోదరి ఎల్లమ్మను దర్శించుకుని బోనాలు, బెల్లం పాకంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్లమ్మ దర్శనానికి దాదాపు నాలుగు గంటలకుపైగా సమయం పట్టింది. భక్తుల తాకిడి పెరగడంతో పోలీసులు రెండు కిలో మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేశారు. దీంతో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తాగునీటి సౌకర్యం లేకపోవడంతో పలువురు ఇబ్బంది పడ్డారు. అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, ఎసీపీ సతీశ్ ఆధ్వర్యంలో కొమురవెల్లిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.