- 8 మంది మావోయిస్టులు మృతి
- ఒక జవాన్ కూడా మృతి... ఇద్దరికి గాయాలు
- కొనసాగుతున్న కూంబింగ్
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్‌లో నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో శనివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక ఎస్టీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల్లో జరుగుతున్న ఈ భారీ ఆపరేషన్‌లో నారాయణ్‌పూర్, కొండెగావ్, కాంకేర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ 53వ బెటాలియన్‌కు చెందిన 1400 మంది జవాన్లు పాల్గొన్నారు.
రెండు రోజుల క్రితమే నాలుగు జిల్లాలకు చెందిన బలగాలు నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో ఉన్న కుతుల్, ఫర్సాబేడా, కొడ్తామేట గ్రామాల్లో ఆపరేషన్ షురూ చేశారు. జవాన్లు అధునాతన ఆయుధాలతో అడవులను జల్లెడ పడుతున్నారు. జవాన్లు శుక్రవారం నుంచే కూంబింగ్ ప్రారంభించి అడవుల నుంచి తిరిగి వస్తుండగా శనివారం ఉదయం కుతుల్ గ్రామం వద్ద మావోయిస్టులు ఎదురయ్యారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. కొంతమంది మావోయిస్టులు గాయపడి పారిపోతుండగా.. వారిని వెంబడిస్తూ బలగాలు వెళ్లాయి. దట్టమైన కొండ ప్రాంతాలు కావడంతో బలగాలు బయటకు రావడానికి ఇబ్బందిగా మారింది. కాగా.. మావోయిస్టుల కాల్పుల్లో గాయపడిన జవాన్లను హెలికాప్టర్ లో రాయ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. సీఎం విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన జవాను కుటుంబానికి సంతాపం ప్రకటించారు.
ఆయుధాలు స్వాధీనం
ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి భద్రతా బలగాలు ఇన్సాస్ తుపాకులు, 303 రైఫిల్స్, బీఎల్జీ లాంచర్లు, డిటోనేటర్లు, నిత్యావసర సరుకులను స్వాధీనం చేసుకున్నాయి. నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుతుల్, ఫర్సాబేడా, కొడ్తామేట గ్రామాల అడవుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మాటు వేశారనే సమాచారంతో బస్తర్ ఐజీ సుందరరాజ్ అలర్ట్ అయ్యారు. నిఘా వర్గాల నుంచి సేకరించిన సమాచారంతో బలగాలను ఈ ప్రాంతంలో కూంబింగ్‌కు దించారు. కాగా.. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో గడిచిన 161 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 141 మంది మావోయిస్టులు మృతి చెందారు.