జార్ఖండ్లో ఎన్ కౌంటర్.. 8 మంది నక్సల్స్ మృతి.. చనిపోయిన నక్సల్స్లో ఒకరిపై కోటి రివార్డ్

జార్ఖండ్లో ఎన్ కౌంటర్.. 8 మంది నక్సల్స్ మృతి.. చనిపోయిన నక్సల్స్లో ఒకరిపై కోటి రివార్డ్

బొకారో: జార్ఖండ్లోని బొకారోలో ఎన్ కౌంటర్ జరిగింది. సీఆర్పీఎఫ్ దళాలకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది నక్సల్స్ హతమయ్యారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో జార్ఖండ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ సాగించాయి. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి బొకారో జిల్లా లాల్ పానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని లుగు హిల్స్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, నక్సల్స్కు మధ్య గన్ ఫైట్ మొదలైంది.

209 కోబ్రా( Commando Battalion for Resolute Action (CoBRA) దళాలు ఈ ఎన్కౌంటర్లో కీలకంగా వ్యవహరించాయి. రెండు INSAS రైఫిల్స్, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఒక పిస్టోల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

మావోయిస్టులు ఆయుధాలను వదిలిపెట్టి లొంగిపోవాలని, లేదంటే వాళ్లను తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కొందరు మావోయిస్టులు ఇటీవల స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. 2026 మార్చి 31 నాటికల్లా నక్సలిజాన్ని నిర్మూలిస్తామని అమిత్ షా చేసిన ప్రకటన, ఆ ప్రకటన అనంతరం దండకారణ్యాలను భద్రతా దళాలు జల్లెడ పడుతుండటంతో నక్సల్స్లో ఆందోళన నెలకొంది.