డాక్టర్‍, నర్సింగ్‍ పోస్టులన్నీ భర్తీ చేస్తం

డాక్టర్‍, నర్సింగ్‍ పోస్టులన్నీ భర్తీ చేస్తం

వరంగల్, హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో ఏ ఒక్క డాక్టర్‍ పోస్ట్ ఖాళీ లేకుండా చూడాలని సీఎం కేసీఆర్‍ చెప్పారని, అనుమతులు రాగానే డాక్టర్‍, నర్సింగ్‍ పోస్టులన్నీ భర్తీ చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌‌‌రావు తెలిపారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో 8 కొత్త ప్రభుత్వ మెడికల్‍ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయని, ఒక్కో కాలేజీ కోసం రూ.500 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో సూపర్‍ స్పెషాలిటీ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట, మహబూబ్‍నగర్‍లోని కొత్త మెడికల్‍ కాలేజీల్లో పీజీ సీట్లు పెంచనున్నట్లు తెలిపారు. గురువారం వరంగల్‍, హనుమకొండ జిల్లాల్లో హరీశ్‌‌‌‌ పర్యటించారు. ఎంజీఎం హస్పిటల్‌‌‌‌లో 42 బెడ్స్‌‌‌‌తో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కేర్‍ యూనిట్‍, మదర్‍ మిల్క్ బ్యాంక్‍, టీబీ స్పెషాలిటీ క్లినిక్‍, బ్లడ్‍ స్టోరేజ్‍ యూనిట్‌‌‌‌ను ప్రారంభించారు. డయాగ్నస్టిక్‍ సెంటర్‍ ఏర్పాటుకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍, చీఫ్‌‌‌‌ విప్‍ వినయ్ భాస్కర్‍తో కలిసి శంకుస్థాపన చేశారు. ఎంజీఎంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌‌‌‌ మాట్లాడారు.

33 జిల్లాల్లో పీడియాట్రిక్‍, డయాగ్నస్టిక్‍ సెంటర్లు
రాష్ట్రంలో 33 జిల్లాల్లో పీడియాట్రిక్ ఐసీయూ సెంటర్లు నెలకొల్పడానికి రూ.86 కోట్లు ఖర్చు పెడుతున్నామని మంత్రి హరీశ్‌‌‌‌ తెలిపారు. వరంగల్‍ ఎంజీఎంలో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ ఐసీయూ వార్డులో రూ.3.05 కోట్లతో అన్ని రకాల ఎక్విప్‍మెంట్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. 57 రకాల మెడికల్‍ టెస్టులు నిర్వహించే టీ డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 20 జిల్లాల్లో ఉండగా.. మిగతా 13 జిల్లాల్లోనూ శ్రీకారం చుట్టామన్నారు. మేడారం జాతర పూర్తి కాగానే హెల్త్ ప్రొఫైల్‍ కార్యక్రమాన్ని ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో మొదట ప్రారంభిస్తామని తెలిపారు.

ప్రధాని క్షమాపణలు చెప్పాలె
ఉమ్మడి ఏపీ విభజనపై ప్రధాని మోడీ మాటలు తెలంగాణ ఉద్యమకారులను అవమానించేలా.. అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ఉన్నాయని హరీశ్ మండిపడ్డారు. ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్‍ చేశారు. బడ్జెట్‌‌‌‌లో 2 గిరిజన వర్సిటీలకు కలిపి రూ.40 లక్షలు కేటాయించారు తప్పితే.. ఇంకేమీ ఇవ్వలేదన్నారు. తమ రాష్ట్రాన్ని తాము అభివృద్ధి చేసుకుంటుంటే అవమానిస్తున్నారన్నారు. సాగు చట్టాలపై కేంద్రం మూజువాణి ఓటుతో ఆదరాబాదరాగా నెగ్గించుకుంటే లేని తప్పు.. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో.. అధికార, ప్రతిపక్షాల అంగీకారంతో తెలంగాణ తెచ్చుకుంటే మీకు తప్పుగా కనపడుతోందా అంటూ హరీశ్ ప్రశ్నించారు. ‘‘లోయర్‍ సీలేర్‍ పవర్‍ ప్లాంట్‍, 7 మండలాలను రాత్రికి రాత్రి కేబినెట్‌‌‌‌ మీటింగ్ పెట్టి ఆదరాబాదరాగా ఆంధ్రాకు అప్పజెప్పలేదా? తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎంను అడిగినరా? రాష్ట్ర శాసనసభను సంప్రదించిన్రా? మీరు చేస్తే ఒప్పు. మేం చేస్తే తప్పా?” అని ఫైర్ అయ్యారు.

తెలంగాణను.. మళ్లీ ఆంధ్రాలో కలుపుతరు
‘‘వరంగల్‍ జర్నలిస్టులు చాలా పోరాటాలు చేసిన్రు. మోడీ కామెంట్లను జర్నలిస్టు సంఘాలు ఖండించాలె. ఆ రోజు ఉద్యమంలో మీరంతా పాల్గొన్నరు. ఇప్పటికే టీఎన్జోఓలు రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్రు. జర్నలిస్టులు ఇలాంటి కామెంట్లను ఖండించకపోతే.. వాళ్లు తెలంగాణను తీసుకపోయి మళ్లీ ఆంధ్రాలో కలిపే ప్రమాదముంటది” అని హరీశ్ అన్నారు.