IPL Tickets: బ్లాక్‌లో ఐపీఎల్‌ మ్యాచ్ టికెట్లు.. 8 మంది అరెస్ట్

IPL Tickets: బ్లాక్‌లో ఐపీఎల్‌ మ్యాచ్ టికెట్లు.. 8 మంది అరెస్ట్

ఐపీఎల్.. ఐపీఎల్.. దేశమంతా ఇదే ఫీవర్. సాయంత్రం అయితే టీవీల ముందు.. తెల్లారిందంటే, ముందు రోజు జరిగిన మ్యాచ్ గెలుపోటములపై చర్చ. దీన్ని అవకాశంగా చేసుకొని కొందరు కేటుగాళ్లు బ్లాక్ మార్కెట్‌ దందాకు తెరలేపారు. తక్కువ ధరకు ఆన్‌లైన్‌లో టికెట్లు కొని.. వాటిని ఎక్కువ ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటి ముఠాను చెన్నై పోలీసులు పట్టుకున్నారు.

ఏప్రిల్ 8న చెన్నైలోని చెపాక్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ - కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు ఆన్‌లైన్‌లో ప్రారంభమైన 10 నిమిషాల్లోనే అయిపోయాయి. దీంతో మ్యాచ్‌ చూడాలనుకున్న చాలా మంది నిరుత్సాహ పడ్డారు. అలా టికెట్లు లభించని అభిమానులు.. దీని వెనుక కొందరి హస్తం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం పరిసరాల్లో అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. 

ఈ సమాచారం మేరకు నగర పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న వారిని పట్టుకునేందుకు ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలోని పోలీసు బృందాలను నియమించారు. పట్టాభిరం గేట్, వల్లజా రోడ్, బెల్స్ రోడ్, వల్లజా రోడ్ జంక్షన్, విక్టోరియా హాస్టల్ రోడ్ జంక్షన్, చెపాక్ రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో నిఘా ఉంచిన పోలీసులు.. అధిక ధరలకు మ్యాచ్ టికెట్లు విక్రయిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.13,500 విలువైన 13 టిక్కెట్లు, రూ.2,950 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్‌ బెయిల్‌పై వారిని విడిచిపెట్టారు.