
మంచైనా.. చెడైనా.. ఫలితం అనుభవించక తప్పదు. అయితే తప్పుని సరిదిద్దుకునే అవకాశం అరుదుగా దొరుకుతుంది. ఆ అవకాశాన్ని కూడా వద్దనుకుంటే.. ఏం జరుగుతుందో కర్ణాటకలో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి చదివితే తెలుస్తుంది.
కొడగు (కూర్గ్) జిల్లాలోని కొడగడలు గ్రామం హైవేకి ఆనుకుని ఉంటుంది. దారిన వెహికల్స్‌లో పోయేవాళ్లంతా ఆ ఊరి రోడ్డు మీదే చెత్తని పడేసి పోతుంటారు. ఈ సమస్య చాలా ఏండ్ల నుంచి ఉంది. దీంతో కొడగు టూరిజం అసోషియేషన్ మెంబర్స్, ఆ గ్రామ పంచాయితీ సభ్యులంతా కలిసి రెండు రోజులు కష్టపడి ఆ ఏరియాను క్లీన్ చేశారు. ‘చెత్త పడేయరాదు’ అని సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ, ఇద్దరు యువకులు అదేం పట్టించుకోలేదు. పిజ్జా తినేసి ఆ ప్యాకెట్‌లను అక్కడ పడేసి వెళ్లిపోయారు. అలాగని ఆ చెత్తని గ్రామస్తులు క్లీన్ చేయలేదు.
పిజ్జా ప్యాకెట్‌లో బిల్.. ఆ బిల్‌లో ఆ మనిషి ఫోన్ నెంబర్ ఉంది. దీంతో అతనికి ఫోన్ చేసి. .వెనక్కి వచ్చి చెత్త తీసేయాలని రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఒక పక్క ‘సారీ’ చెబుతూనే.. చాలా దూరం వచ్చేశానని చెప్పాడు. దీంతో లోకల్ పోలీసులతో ఆ వ్యక్తికి ఫోన్ చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలని అతని నెంబర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇంకేం వరుసబెట్టి అతనికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో ఇబ్బందిగా ఫీలైన ఆ వ్యక్తి.. 80 కిలోమీటర్లు వెనక్కి రావాల్సి వచ్చింది. మడికేరికి చెందిన ఆ యువకుడు, తన ఫ్రెండ్‌తో జాలీగా ట్రిప్‌కి వచ్చి.. ఈ పని చేశాడు. చివరికి గ్రామస్తులకు ‘సారీ’ చెప్పి.. ఆ చెత్త ప్యాకెట్స్‌ను అక్కడి నుంచి తీసేశారు. కాస్త ముందుకెళ్లాక మళ్లీ ఆ చెత్త ప్యాకెట్‌ని పడేస్తారన్న ఉద్దేశంతో.. ఎందుకైనా మంచిదని వాటి మీద ఆ ఇద్దరు యువకుల ఫోన్ నెంబర్లు రాశారు ఆ ఊరి జనాలు.