80 శాతం సర్కార్ దవాఖాన్లలో సౌలతుల్లేవ్: కేంద్ర ఆరోగ్య శాఖ

80 శాతం సర్కార్ దవాఖాన్లలో సౌలతుల్లేవ్: కేంద్ర ఆరోగ్య శాఖ
  •    దేశవ్యాప్తంగా 20 శాతం ఆస్పత్రుల్లోనే కనీస ప్రమాణాలు 
  •     ఎన్ హెచ్ఎం ఆధ్వర్యంలోని ఆస్పత్రుల్లో అరకొర ఫెసిలిటీలు   
  •     కేంద్ర ఆరోగ్య శాఖ సర్వేలో వెల్లడి  

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, యూటీల్లోని సర్కార్ దవాఖాన్లలో దాదాపు 80 శాతం ఆస్పత్రుల్లో కనీస సౌలతులు, సిబ్బంది, ఎక్విప్ మెంట్, ప్రమాణాలు కూడా లేవని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కేవలం 20 శాతం సర్కార్ దవాఖాన్లలోనే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్)కు అనుగుణంగా కనీస ప్రమాణాలు ఉన్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) పరిధిలోని జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (సబ్ హెల్త్ సెంటర్లు) వంటివి మొత్తం 2 లక్షల పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీలు ఉన్నాయి. 

ఇందులో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐపీహెచ్ఎస్​కు అనుగుణంగా కనీస సౌలతులు ఉన్నాయా? లేవా? అన్నది గుర్తించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల ఒక సెల్ఫ్ అసెస్ మెంట్ సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగా ఆయా ఆస్పత్రుల్లో సౌలతులు, డాక్టర్లు, నర్సులు, ఎక్విప్ మెంట్స్, మందులు, అత్యవసర సర్వీసులు, ఇతర వివరాలను ఎంటర్ చేసేందుకు ఒక డ్యాష్​బోర్డును ప్రారంభించింది. 

మొత్తం 2 లక్షల ప్రభుత్వ దవాఖాన్లకు గాను.. 40,451 ఆస్పత్రులు తమ వివరాలను ఎంటర్ చేశాయి. దీంతో కేవలం 8,089 ఆస్పత్రులు మాత్రమే ఐపీహెచ్ఎస్ కు అనుగుణంగా నిర్దేశించిన కనీస ప్రమాణాలకు అవసరమైన మేరకు 80 శాతం, అంతకుమించిన స్కోర్ సాధించాయని వెల్లడైంది. అంటే వీటిలో మాత్రమే అన్ని సౌలతులు, డాక్టర్లు, స్టాఫ్, మందుల వంటివి నిర్దేశించిన మేరకు ఉన్నాయని తేలింది. అలాగే 17,190 ఆస్పత్రులు 50 శాతం కంటే తక్కువగా స్కోర్ చేయగా.. మిగతా 15,172 దవాఖాన్లు 50 నుంచి 80 శాతం మధ్యలో స్కోర్ చేశాయి.