
- ఐదేండ్లుగా సగానికి పైగా పంట దిగుబడులు లాస్
- ఏండ్లుగా నష్టాలతో సిటీలకు వలసలు, ఇతర పనుల్లోకి
- ‘‘రైతులపై తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావం”
- పేరిట ఫీడ్ సంస్థ రిపోర్ట్
న్యూఢిల్లీ: వాతావరణ పరిస్థితులు అనుకూలించక దేశంలోని చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనిఫోరమ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఫర్ ఈక్విటెబుల్ డెవలప్మెంట్ (ఫీడ్) అనే సంస్థ తెలిపింది. కరువు, అకాల వర్షాలు, వరదలు పంట చక్రం(క్రాపింగ్ సైకిల్) పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ‘‘సన్నకారు రైతులపై వాతావరణ మార్పుల ప్రభావం” పేరిట ఫీడ్ రిలీజ్ చేసిన తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఫీడ్ అనేది రైతులు ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సంస్థ. ఐదేండ్లుగా చిన్న రైతులు తమ పంట దిగుబడులను 50 శాతానికి పైగా నష్టపోయారని రిపోర్ట్ తెలిపింది. డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) సహకారంతో ఈ రిపోర్ట్ రూపొందించినట్లు వివరించింది. ఈ నెల 25న(మంగళవారం) ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో దీన్ని విడుదల చేసి, డిబేట్ నిర్వహించింది.
దేశంలో 41 శాతం చిన్న రైతులే
దేశంలోని వ్యవసాయం చేసే వారిలో దాదాపు 41 శాతం మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. 50 శాతం వరి రైతులు, 40 శాతానికి పైగా గోధుమ రైతులు తమ పంటలను సగానికి పైగా కోల్పోవడం గత ఐదేండ్లుగా స్థిరంగా కనిపిస్తున్నదని స్టడీలో తేలింది. ఇతర పంటలు పండించే రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలిపింది. పెరిగిన టెంపరేచర్లు, అధిక వర్షాలు, సుదీర్ఘమైన శీతాకాలాలు, కరువు, వరదలు ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. దేశంలో 10 శాతం మంది రైతుల పంటలకు మాత్రమే నష్టం జరగలేదని నివేదించింది. 21 రాష్ట్రాల్లోని 6,615 మంది సన్నకారు రైతులను స్టడీ చేసి ఈ రిపోర్టు తయారు చేసినట్లు తెలిపింది. ఇండియాలో సన్నకారు రైతులు అంటే సగటున 1 హెక్టార్ భూమిలో సాగు చేసేవారిని.. ఇందులో భూ యజమానులు, కౌలుదారులు కూడా ఉన్నారని వివరించింది. చిన్న కారు, సన్న కారు రైతులకు వ్యవసాయం కష్టంగా మారిందని తెలిపింది.
వ్యవసాయం వదిలేస్తున్నరు
ఆర్థిక పరిమితులు, సరిపడినంత సాంకేతిక మద్దతు లేకపోవడం కూడా రైతులు నష్టపోవడానికి కొంత కారణంగా పేర్కొంది. తీవ్ర వాతావరణ పరిస్థితుల నష్టపోతున్న రైతుల్లో చాలా మంది తమ ఇతర వృత్తులు, కూలీ పనులు, పశుపోషణ, సమీప నగరాలకు వలస వెళ్లినట్లు తెలిపింది. చర్చలో కేంద్రం వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శామ్యూల్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మన దేశంలో ఎక్కువ మంది రైతులు రుతుపవనాలపై ఆధారపడే వ్యవసాయం చేస్తారని.. వాతావరణం అనుకూలించకపోతే వారు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని కిసాన్ కాల్ సెంటర్కుఅత్యధిక ఫోన్‌కాల్స్ లో కూడా రైతులు వాతావరణ పరిస్థితుల గురించి ఆరా తీస్తున్న విషయాన్ని వెల్లడించారు.