భారత్‌‌‌‌కు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వార్నింగ్

భారత్‌‌‌‌కు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వార్నింగ్

ఇస్లామాబాద్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భారత్‌‌‌‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. భారత్ తమను కొంచెం రెచ్చగొట్టినా గట్టిగా బదులిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. న్యూక్లియరైజ్డ్ వాతావరణంలో యుద్ధానికి చోటు లేదని పేర్కొన్నాడు. శనివారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అబోటాబాద్‌‌‌‌ లోని ప్రీమియర్ పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన ఆర్మీ క్యాడెట్ల పాసింగ్ ఔట్ గ్రాడ్యుయేషన్ వేడుకలో మునీర్ మాట్లాడాడు.

" అణు వాతావరణంలో యుద్ధానికి తావులేదని భారత సైన్యానికి చెబుతున్నాను. అలాగే గట్టిగా హెచ్చరిస్తున్నాను. దేనికీ మేం భయపడం. ఎవరి మాటలతో ప్రభావితం కాబోం. భారత్ మమ్మల్ని రెచ్చగొట్టడానికి చిన్న ప్రయత్నం చేసినా ఎటువంటి సంకోచం లేకుండా గట్టిగా బదులిస్తాం. 

ఇటీవల భారత్‌‌‌‌తో జరిగిన ఘర్షణల్లో పాకిస్తాన్ సాయుధ దళాలు అన్ని ముప్పులను ఎదుర్కొన్నది. భారత సైన్యం సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నా వారిపై పాక్ ఆర్మీ సిబ్బంది విజయం సాధించి అద్భుతమైన వృత్తి నైపుణ్యాన్ని, దూరదృష్టిని ప్రదర్శించింది. పాకిస్తాన్ ను అస్థిరపరిచేందుకు భారత్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోంది. ఉగ్రవాదులతో పాక్​కు హాని కలిగించలేరు.

అంతర్జాతీయ నిబంధనల ప్రకారం కాశ్మీర్ సమస్యను భారత్ పరిష్కరించుకోవాలి. జమ్మూకాశ్మీర్ ప్రజలకు నైతిక, దౌత్యపరమైన మద్దతును పాక్ అందిస్తుంది. పాకిస్తాన్‌‌‌‌ శాంతిని ప్రేమించే దేశం. అమెరికా, చైనాతో సహా పలు దేశాలతో  బలమైన సంబంధాలను కలిగి ఉంది" అని మునీర్ పేర్కొన్నాడు.