మన చేతుల శుభ్రతే మన ఆరోగ్యం!

మన చేతుల శుభ్రతే మన ఆరోగ్యం!

ప్రపంచంలో కొవిడ్ -19 మహమ్మారి విలయ తాండవం చేసిన సమయంలో అధిక శాతం మంది ప్రజలు చేతుల పరిశుభ్రత పైన ఎక్కువ దృష్టి పెట్టారు. యూనిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి పది మందిలో ముగ్గురికి వారి ఇంట్లో హ్యాండ్ వాష్ సౌకర్యాలు అందుబాటులో లేవని, ఇలాంటి సౌకర్యం లేనివారు ప్రపంచవ్యాప్తంగా 670 మిలియన్ల మంది ఉన్నారని  స్పష్టం చేసింది.

 ప్రపంచంలో 462 మిలియన్ల విద్యార్థులు ఎలాంటి చేతి శుభ్రత సౌకర్యాలు లేకుండా పాఠశాలకు హాజరవుతున్నారని నివేదిక చెపుతోంది.77వ జాతీయ నమూనా సర్వే ప్రకారం 45 శాతం మంది భారతీయులే భోజనానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. మలవిసర్జన తర్వాత 75% మంది మాత్రమే సబ్బుతో చేతులు కడుక్కుంటున్నారు. 

దేశంలో 40% పాఠశాలల్లో 42 శాతం అంగన్వాడి కేంద్రాల్లో చేతుల పరిశుభ్రతకు నీరు సబ్బు వసతి లేదు. ఈ విధంగా చేతుల పరిశుభ్రతపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అల్ప, మధ్య ఆదాయ దేశాల అభివృద్ధికి విఘాతంగా నిలుస్తుంది. అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి పది పాఠశాలలకు గాను ఏడు పాఠశాలల్లో పిల్లలు చేతులు కడుక్కోవడానికి స్థలం లేదు.

మన చేతుల్లోనే మన ఆరోగ్యం

మన శరీరంలో అత్యధికంగా క్రిములు చేతులపైన ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు టీవీ, రిమోట్, చరవాణి, లాప్​ట్యాప్​లు,  కరెన్సీ పైన ఎక్కువ క్రిములు ఉంటాయి. 

వీటిని చేతితో తాకడం వల్ల చిన్నపిల్లలు వీటిని నోట్లో పెట్టుకోవడం వల్ల కడుపులోకి హానికర క్రిములు చేరే ప్రమాదం ఉంది. పిల్లలు, పెద్దలు సరిగ్గా చేతులు శుభ్రం చేసుకోకుండానే ఆహారం తీసుకుంటున్నారు. తద్వారా చేతులపై ఉన్న క్రిములు ఆహారంతో కలిసిపోయి శరీరంలోకి చేరుతున్నాయి. ఫలితంగా అనేక రోగాల బారిన పడుతున్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2009లో ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించేందుకు ‘సేవ్ లైవ్స్ క్లీన్ యువర్ హాండ్స్’ పేరిట ప్రతి ఏడాది ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసుల ప్రకారం  పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ప్రైవేట్ వాణిజ్య భవనాల ప్రవేశ ద్వారాల వద్ద,  మార్కెట్లు, ప్రార్థన స్థలాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల వద్ధ చేతి పరిశుభ్రతకు తగిన సౌకర్యాలు కల్పించాలి.  

గ్రామీణ ప్రాంతాలలో చేతులు పరిశుభ్రత అలవాటును పెంపొందించడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. రుతుస్రావం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రతపై మహిళలకు సంపూర్ణ అవగాహన కల్పించాలి.అందరి జీవన విధానంలో చేతుల పరిశుభ్రత అనేది ఒక భాగమైతే అంటువ్యాధులకు  చాలావరకు అడ్డుకట్ట పడుతుంది. 

- అంకం నరేష్–