అభ్యర్థి ఎవరో తెల్వదు..  గుర్తును బట్టే ఓటేస్తం

అభ్యర్థి ఎవరో తెల్వదు..  గుర్తును బట్టే ఓటేస్తం

హైదరాబాద్, వెలుగు: సీనియర్​ సిటిజన్లు, కొంత వయసు పైబడిన వృద్ధులు ఇప్పటికీ పార్టీల గుర్తులను బట్టే ఓటు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థి పేరు కూడా తెలియని వారు వేలలో ఉంటున్నారు. హైదరాబాద్​ సిటీలో.. ఓటు ఎవరికి వేస్తావని వృద్ధులను అడిగితే ఇందిరమ్మ పార్టీకి వేస్తామని కొందరు.. కేసీఆర్‌‌‌‌‌‌ కారు గుర్తుకు వేస్తామని మరికొందరు సమాధానమిస్తున్నారు. మీ నియోజకవర్గ అభ్యర్థి ఎవరు అని అడిగితే చెప్పలేకపోతున్నారు. వారికి తెలిసిందల్లా పార్టీ గుర్తు, ఆ పార్టీలకు చెందిన పాత తరం నాయకులు. గ్రేటర్​ హైదరాబాద్​పరిధిలో ఇప్పటికీ చాలా మంది వృద్ధులు, సీనియర్​ సిటిజన్లు ఇందిరా గాంధీ,  సోనియా గాంధీ, ఎన్టీఆర్‌‌‌‌, పి.జనార్దన్ రెడ్డి, రాజశేఖర్​రెడ్డి తదితర నాయకుల పేర్లు చెబుతుండగా, మరికొందరు కేసీఆర్ ​పేరు చెబుతూ... చేయి, కారు గుర్తుకు ఓటు వేస్తం అంటున్నారు.

 ఇందిర కాలం నాటివారు..

70 ఏండ్లకు పైబడినవారు ఇందిరా గాంధీ, ఎన్టీఆర్‌‌‌‌, వాజ్​పేయీ పాలన చూసిన వారే.  ప్రస్తుతం వారందరికీ వయసు పైబడటంతో ఇండ్లలో రెస్ట్ తీసుకుంటున్నారు.  వారికి ఇప్పటి తరం నాయకులు తెలియదు. వారు ఆయా పార్టీలు, నాయకులు ఆనాడు చేసిన అభి వృద్ధి, ఇతర సంఘటనల గురించే మాట్లాడుతున్నారు. కొందరు వృద్ధులు తాము ఆనాటి నుంచే కాంగ్రెస్‌‌కు ఓటు వేస్తున్నామని, ఇప్పటికీ అదే పార్టీకి వేస్తున్నామ ని అంటుండగా.. మరి కొందరు కేసీఆర్ పెన్షన్లు పెం చిండు మేము కారు గుర్తుకు ఓటు వేస్తామని చెబుతున్నారు.  ఇంకొదరైతే మాకు ఏం తెలియదు, మా కొడుకులు, బిడ్డలు ఎవరికి ఓటు వేయాలని చేబితే వారికే ఓటు వేస్తా మని చెబుతుండటం గమనార్హం.  ఖైరతాబాద్​లో ఓ వృద్ధుడిని అభ్యర్థుల పేర్లు అడగ్గా కాంగ్రెస్​ నుంచి జనార్థన్‌‌ రెడ్డి బిడ్డ పోటీలో ఉన్నారని, ఆమె పేరు మాత్రం తెలియదని సమాధానం చెప్పాడు.  

సాధారణ ఓటర్ల పరిస్థితి అంతే..

తమ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరో  తెలియని వారు వృద్ధులు మాత్రమే అనుకుంటే  పొరపాటే. చాలా మంది సాధారణ ఓటర్లు కూడా ఆ లిస్ట్​లో ఉన్నారు.  సిటీలోని ఆయా నియోజకవర్గాల్లో  యువతను ఫలానా పార్టీ అభ్యర్థి ఎవరూ అని అడగ్గా, కొంత మంది ఏమో తెలియదు అని సమాధానం ఇచ్చారు. మరికొందరు  ఒకరిద్దరి పేర్లు చెప్పారు.  పోలింగ్ ​రోజు ఎవరో ఒకరికి వేస్తం.  లేదంటే ఇష్టమైన పార్టీ తరఫున ఎవరు నిలుచున్నా ఓటు వేస్తామని అంటున్నారు. లేబర్ ​పని, ఇతర చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి చాలా వరకు వారి సెగ్మెంట్లలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరో తెలియదని చెబుతున్నారు. ప్రచారంలో పాల్గొంటున్న అడ్డా మీది కూలీలను అడిగితే రోజుకో పార్టీ ప్రచారానికి వెళతామని అభ్యర్థుల పేర్లు గుర్తుండవని చెప్పేస్తున్నారు. 

గ్రేటర్​లో వృద్ధుల ఓట్లు 80  వేల పైనే

గ్రేటర్‌‌‌‌లో మొత్తం 45,36,852 మంది ఓటర్లు ఉండగా అందులో.. 80 ఏండ్లకు పైబడిన ఓటర్లు 80,037 మంది ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో 80 నుంచి 100 ఏండ్ల మధ్య ఓటర్లు 4.4  లక్షలు, వందేళ్లకు పైబడిన వారు 7,629 మంది ఓటర్లు ఉన్నారు. 

గుర్తును చూసే వేస్త..

నాకు కేసీఆర్, సోనియా గాంధీ పేర్లు.. కారు గుర్తు,  చేయి గుర్తులు తెలుసు. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరో, వారి పేర్లు ఏమిటో తెల్వయి.  ఎప్పుడు ఓటేసినా.. పార్టీ గుర్తులను బట్టే వేస్తున్న.
‑ ఎం. రాయప్ప, వయసు 82, ఫిలిం నగర్​ 

ఒకరిద్దరి పేర్లు తెలుసు

పోటీ చేసేటోళ్లు ఏటా మారుతున్నరు. అందరి పేర్లు ఎక్కడ గుర్తుంటయి? ఒకరిద్దరి పేర్లు తెలుసు.  మిగిలిన వాళ్లు ఎవరు ఉన్నరో తెల్వదు. ప్రచారం బండ్ల మీద వాళ్ల ఫొటోలు కనబడుతున్నయి కానీ.. వాళ్లను నేను చూడలేదు.
‑ వెంకటయ్య, వయసు 75, జూబ్లీహిల్స్​