న్యూఢిల్లీ, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసేందుకు తెచ్చిన సువిధ పోర్టల్ కు తెలంగాణ నుంచి 836 దరఖాస్తులు అందాయని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. ఈ మేరకు ఈసీఐ ఆదివారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. లోక్ సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల కోసం సువిధ యాప్ ను తీసుకొచ్చినట్లు తెలిపింది. ర్యాలీలు, ప్రదర్శనలు, వాహనాల, హెలికాప్టర్లు వంటి పది రకాల అనుమతులు ఇస్తున్నట్టు చెప్పింది. సువిధ యాప్ కు అనూహ్య స్పందన వస్తున్నట్టు వివరించింది.
ఆదివారం వరకు దేశ వ్యాప్తంగా73, 379 దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. 60 శాతానికి పైగా అంటే 44,626 దరఖాస్తులకు పర్మిషన్ ఇచ్చినట్టు వెల్లడించింది. 11,200 అప్లికేషన్లను తిరస్కరించామని, మరో 10,819 దరఖాస్తులను చెల్లనివిగా ప్రకటించామని వివరించింది. మరో 6734 అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నట్టు వెల్లడించింది. అత్యధికంగా తమిళనాడు నుంచి 23,239, వెస్ట్ బెంగాల్ నుంచి 11,976, మధ్యప్రదేశ్ నుంచి 10,636 అప్లికేషన్లు వచ్చినట్టు స్పష్టం చేసింది. అతి తక్కువగా చండీ గఢ్ నుంచి 17, లక్షద్వీప్ నుంచి 18, మణిపూర్ నుంచి 20 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది.