కోల్ గ్యాసిఫికేషన్‌‌కు రూ.8500కోట్ల పెట్టుబడి రాయితీలు: అమ్రిత్

కోల్ గ్యాసిఫికేషన్‌‌కు రూ.8500కోట్ల పెట్టుబడి రాయితీలు: అమ్రిత్

హైద‌‌రాబాద్‌‌, వెలుగు: సుస్థిరమైన ఇంధన భద్రత కల్పించేందుకు కోల్ గ్యాసిఫికేష‌‌న్ ను ప్రోత్సహిండానికి  కేంద్ర ప్రభుత్వం రూ.8500 కోట్ల పెట్టుబడి సబ్సిడీ అందించాలని నిర్ణయించిందని  కేంద్ర బొగ్గు శాఖ సెక్రటరీ అమ్రిత్‌‌ లాల్ మీనా తెలిపారు. ప్రభుత్వ,  ప్రైవేటు బొగ్గు, లిగ్నైట్‌‌ ఉత్పత్తి సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమ్రిత్‌‌ లాల్ మీనా పిలుపునిచ్చారు. శుక్రవారం  హైదరాబాద్ లోని హోటల్‌‌లో  జరిగిన ఓ కార్యక్రమంలో  ఆయన మాట్లాడారు. బొగ్గు, లిగ్నైట్ ఖనిజాలను భూగర్భంలోనే మండించి మీథేన్ వంటి గ్యాస్ లను ఉత్పత్తి చేయడం ద్వారా ఇంధన అవసరాలు తీర్చే అవకాశం ఉందని చెప్పారు.

ఈ విధానానికి ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రత్యేక రాయితీలను కేటాయించిందని పేర్కొన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ చేపట్టడానికి అన్ని కంపెనీలు ముందుకు రావాలన్నారు. గ్యాస్‌‌ ఇంపోర్ట్స్‌‌ త‌‌గ్గించ‌‌డానికి ఇది దోహ‌‌ద‌‌ప‌‌డుతుంద‌‌న్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియ పర్యావరణహితమైనదని, ఆయా సంస్థల వ్యాపార విస్తరణకు ఎంతగానో ఉపయోగపడుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో  బొగ్గు మంత్రిత్వ శాఖ అద‌‌న‌‌పు కార్యద‌‌ర్శి  రూపేంద‌‌ర్ బ్రార్‌‌,  సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ త‌‌దిత‌‌రులు పాల్గొన్నారు. 

సింగరేణికి కొత్త గనులు కేటాయించండి 

సింగరేణి సంస్థకు కొత్త గనులను కేటాయించి సంస్థను కాపాడాలని, ఐఎన్‌‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కేంద్ర బొగ్గు శాఖ సెక్రటరీ అమ్రిత్‌‌ లాల్ మీనాను కోరారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్‌‌లో కోల్ సెక్రటరీని కలిసి వినతి పత్రం అందించారు. 2030 నాటికి సింగరేణి సంస్థలో పాత గనులు మూతపడే పరిస్థితులు  ఉన్నాయని తెలిపారు. ఈ తరుణంలో కొత్త బ్లాకులను కేటాయించి 13 దశాబ్దాల చరిత్ర గల సింగరేణిని, 40వేల మంది కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.