విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు..  వేలల్లో కండ్లకలక బాధితులు

విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు..  వేలల్లో కండ్లకలక బాధితులు
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో 86 డెంగీ కేసులు నమోదు
  • వేలల్లో కండ్లకలక బాధితులు
  • కానరాని దోమల మందు స్ప్రే, ఫాగింగ్
  • అవగాహన కార్యక్రమాలూ అంతంత మాత్రమే

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒకవైపు  డెంగీ కేసులు భయపెడుతుండగా, మరోవైపు టైఫాయిడ్, కండ్లకలక బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో డెంగీ కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తూ ఇప్పటికే 70 కేసులు నమోదు కాగా,  మెదక్ జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో డెంగీ కేసులు లేకపోయినప్పటికీ టైఫాయిడ్, కండ్లకలక కేసులు వేలల్లో పెరుగుతున్నాయి. వాతావరణంలో మార్పులు, పారిశుధ్య లోపంతో సీజనల్ వ్యాధులు, విష జ్వరాల కారణంగా ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. 

ఇదీ పరిస్థితి.. 

సంగారెడ్డి జిల్లాలో డెంగీ కేసులు ఇప్పటికే 70 నమోదు కాగా టైఫాయిడ్ కేసులు సుమారు 500కు పైగా నమోదయ్యాయి. కండ్లకలకతో దాదాపు పదివేల మంది బాధపడుతున్నారు. 
మెదక్​ జిల్లా వ్యాప్తంగా డెంగీ కేసులు 16, టైఫాయిడ్​ కేసులు లేకపోగా, కండ్లకలక కేసులు 260 వరకు నమోదయ్యాయి. 
సిద్దిపేట జిల్లాలో టైఫాయిడ్ కేసులు 400, కండ్లకలక కేసులు ఆరు వేలకు పైగానే నమోదయ్యాయి. ముందుగా వర్గల్​లోని నవోదయలో 82 మందికి, ములుగులోని టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్   స్కూల్​లో 60 మంది స్టూడెంట్స్ కు కండ్లకలక సోకింది. అక్కడి నుంచి మొదలైన ఈ వైరస్ జిల్లా వ్యాప్తంగా ప్రబలింది. ఈ జిల్లాలో డెంగీ కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదు. 

అలర్ట్.. అవెర్నేస్​ ఏదీ? 

వర్షాకాలం సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. పారిశుధ్య పనులు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. పట్టణం, పల్లెల చివరన, రోడ్ల పక్కన చెత్తాచెదారం కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం దోమల నివారణకు స్ప్రే, ఫాగింగ్ లాంటివి కూడా చేపట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో శుక్రవారం నుంచి కండ్లకలక బారిన పడిన స్టూడెంట్స్ కు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ నేతృత్వంలో వైద్య బృందం వైద్య సేవలందిస్తోంది. కానీ సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వైద్య బృందాలు ప్రజల్లో కనీసం చైతన్య కలిగిస్తలేవన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.